LSG vs DC IPL2024 match Preview and prediction : ఈ ఐపీఎల్(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) మరో విజయంపై కన్నేసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో లక్నో తలపడనుంది. ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన లక్నో..ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో లక్నోపై ఇప్పటివరకూ గెలవని ఢిల్లీ… ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను అడ్డుకోవాలంటే… ఢిల్లీ బౌలర్లు తమ స్థాయికి మించి రాణించాల్సి ఉంది.
లక్నో బౌలింగే బలం
150కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు సంధిస్తూ లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న లక్నో స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో లక్నో పేసర్ యష్ ఠాకూర్… గుజరాత్‌పై అయిదు వికెట్లు తీసి సత్తా చాటాడు. యష్ ఠాకూర్ సహా నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డి కాక్, KL రాహుల్‌లతో బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. డికాక్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోవడంతో కెప్టెన్ రాహుల్ ఇంకా సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఆ లోటు తీర్చుకోవాలని రాహుల్ పట్టుదలగా ఉన్నాడు. నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరిలో బ్యాటింగ్‌కు వస్తున్న పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. కానీ దేవదత్ పడిక్కల్ ఫామ్ లక్నోను ఆందోళన పరుస్తోంది.
ఢిల్లీ గాడిన పడేనా..?
ఢిల్లీ అయిదు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ… తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో తేలిపోతున్నారు. ముఖేష్ కుమార్ కూడా పెద్దగా రాణించడం లేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్ మినహా మిగిలిన బ్యాటర్లు ఇంకా గాడిన పడలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా మరోసారి బ్యాట్ ఝుళిపించాలని ఢిల్లీ కోరుకుంటోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
రిషబ్ పంత్ ( కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.
మరిన్ని చూడండి