చంద్రబాబు, దక్షిణాదిలో సీనియర్ రాజకీయవేత్త. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలున్నాయి. బాబు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా గడించిన అనుభవం ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో మరే ఇతర రాజకీయ నేతకు ఉండవంటే అతిశయోక్తి కాదు. దివంగత ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్‌రావు పదవీచ్యుతుడిని చేసి, తాను ఆ పదవిని లాక్కున్న సందర్భంలో చంద్రబాబు పోషించిన పాత్ర అద్భుతమైందని ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే ఇదే చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ అని కూడా ఆలోచించకుండా 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, దిగ్విజయంగా ప్రజామోదం పొందిన నేతగా చరిత్రకెక్కాడు. అలాగే దేశ రాజకీయాల్లో తనదైన రాజకీయ ముద్ర వేసుకున్నాడు. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా తెలుగునాట తెలుగుదేశం ఆవిర్భవించిందో…అదే పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లిన ఘన చరిత్ర కూడా బాబు సొంతం చేసుకున్నాడు.
23 మంది ప్రత్యర్థి ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని, వాళ్లలో ఐదుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడమే కాదు…ప్రజాస్వామ్య విలువల గురించి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇచ్చిన, ఇస్తున్న మహానాయకుడు మన చంద్రబాబు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని ఏపీలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చిన ధైర్యశాలి చంద్రబాబు. కానీ జగన్‌పై నమోదైన సీబీఐ కేసుల గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఎంత అవినీతిపరుడో చూడంటూ జనానికి లెక్చరర్లు ఇవ్వడం ఒక్క బాబుకే సొంతం.
తాను ప్రత్యర్థి పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేల సంఖ్యే చివరికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్కించుకున్న దయనీయ స్థితి బాబుది. ఒకవైపు బీసీలకు 34% రిజర్వేషన్లు చెల్లవని సొంత పార్టీ నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించి, తాను కోరుకున్నట్టుగానే తీర్పు రావడంతో ఆనందించిన బాబు…బీసీల ద్రోహి జగన్ అని విమర్శించిన కొంటెతనం బాబు సొంతం. తనకు అవకాశం ఉన్నప్పుడు గుర్తు రాని దళితులు, తగదునమ్మానంటూ ఏ మాత్రం బలం లేని పరిస్థితుల్లో రాజ్యసభ సీటుకు ఓ దళితుడిని ముందు పెట్టి రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్న గొప్ప నట చక్రవర్తి మన చంద్రబాబు. రాజకీయాల్లోనే కాదు నటనలో కూడా మామకు మించిన అల్లుడు చంద్రబాబు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడాయన రాజకీయ జీవితంపై సినిమా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి పేరుతో సినిమా తీయడం, అది బంఫర్ హిట్ సాధించడం తెలిసిందే. తాజాగా చంద్రబాబు రాజకీయ జీవిత కథ ఆధారంగా మహానటుడు అనే టైటిల్‌తో సినిమా తీస్తే మహానటి మించిన విజయాన్ని సాధిస్తుందడనంలో సందేహం లేదు. ఈ దిశగా రాజమౌళి, త్రివిక్రమ్, నాగ్ అశ్విన్ లేదా రాంగోపాల్‌వర్మ లాంటి కళాత్మక దర్శకులు ఆలోచిస్తే బాగుంటుంది.
Topics: