Mayank Agarwal discharged: విమానంలో మంచి నీళ్లని భ్రమించి హానికర ద్రవం తాగిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రయాణం చేసేందుకు ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడంతో బుధవారం సాయంత్రం అతడు బెంగళూరు చేరుకొన్నాడు.తాను కోలుకుంటున్నా అని మయాంక్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని… త్వరలోనే బయటకు వస్తానని మయాంక్ తెలిపాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి.. తనపై ప్రేమ చూపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలని ’ మయాంక్ అగర్వాల్ పోస్ట్ చేశాడు. విమానంలో కూర్చుని తన ముందున్న హానికర ద్రవాన్ని మంచి నీళ్లు అనుకొని తాగి మయాంక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ద్రవం కారణంగా గొంతులో బొబ్బలు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉండి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడంతో బెంగళూరుకు తీసుకురాగా స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి మరోసారి పరీక్షలు చేయించుకొంటాడని సమాచారం. ప్రస్తుతం అతడికి విశ్రాంతి తప్పనిసరి కావడంతో శుక్రవారం నుంచి సూరత్‌లో రైల్వే్‌సతో జరిగే రంజీ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇంతకీ ఏమైందంటే..?
టీమిండియా (Team India) క్రికెటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో కర్నాటకకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ .. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. అగర్తలాలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. విమానంలో కర్నాటక జట్టుతో ఉన్న అగర్వాల్.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. మయాంక్.. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
విమానంలోనే…
కలుషిత నీటిని తాగడం వల్లే మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్నాటక గోవాతో పాటు త్రిపురపైనా గెలిచింది. ‘త్రిపురతో మ్యాచ్ ముగిసిన తర్వాత కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. ఇదే సమయంలో వాంతులతో ఇబ్బందిపడ్డ అగర్వాల్ తనకు గొంతులో మంటగా ఉందని చెప్పాడు. కర్నాటక టీమ్ అధికారులు మాకు ఈ విషయం చెప్పడంతోనే వెంటనే విమానం నుంచి కిందకు దించి అగర్తలాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అగర్వాల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని త్రిపుర క్రికెట్ అసోసియేషన్(Tripura Cricket association) ప్రతినిధి తెలిపారు. మయాంక్ అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ తెలిపారు.