ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు యమా హీటెక్కాయి. వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి ఒక్కటై వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించి, వైఎస్ జగన్‌ను ఇంటికి పంపాలన్నది కూటమి ప్రధాన టార్గెట్. ఇందుకోసం వ్యూహ రచన జరుగుతోంది. మీరేం చేసినా సరే తగ్గేదేలే అన్నట్లుగా జగన్ కూడా ఉన్నారు. సరిగ్గా ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ వార్త విన్న జనసేన, కూటమి కార్యకర్తలు, వీరాభిమానులు.. మరీ ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఇదీ అసలు సంగతి!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాలపై ఫోకస్ పెట్టారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా చిరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యారు. తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చిరు అండగా నిలబడ్డారు. జనసేనకు 5 కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో నిర్వారామంగా విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతోంది. అన్నయ్యను కలవడానికి షూటింగ్ దగ్గరికెళ్లిన పవన్.. చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని పవన్‌ను మెగాస్టార్ దీవించారు. అనంతరం ఆంజనేయుడి విగ్రహం సమక్షంలో పవన్, నాగబాబులకు 5 కోట్ల రూపాయిల చెక్‌ను చిరు అందజేశారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ కూర్చొని ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సోదరులిద్దరికీ పలు సలహాలు, సూచనలు చిరు చేశారని తెలుస్తోంది.
ప్రచారం లేదా చిరు..?
కాగా.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గెలిచి చట్ట సభల్లోకి వెళ్లాలన్నదే జనసేనాని టార్గెట్. ఇప్పటికే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పవన్ షురూ చేసేశారు. మరోవైపు.. మోగా ఫ్యామిలీ సైతం చిరుతోనే ఉంది. బాబాయ్ ఒక్క మాట చెబితే చాలు ఎన్నికల కదనరంగంలోకి దూకుతామని ఇప్పటికే అబ్బాయిలు చెప్పేశారు కూడా. అంతేకాదు.. గతంలో తమవంతుగా విరాళాలు ఇవ్వడం, రైతు సంక్షేమ నిధికి కూడా భారీగా ఇచ్చారు. ఇప్పుడు.. చిరు విరాళం ఇవ్వడంతో ఆయన కూడా ప్రచారానికి వస్తారా.. రారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. ఒక్కరోజైనా ప్రచారానికి తీసుకురావాలని సేనాని భావిస్తున్నారట. ఏదైతేనేం.. అన్నయ్య ఆశీర్వాదాలు.. తమ్ముడుకు ఎల్లప్పడూ ఉంటాయన్న మాట.