ByMohan
Thu 15th Feb 2024 05:36 PM
మెగాస్టార్ చిరంజీవి.. తన సినిమాలే కాకుండా.. ఏ ఇతర హీరో సినిమా అయినా సరే.. సపోర్ట్ చేయడానికి ముందుంటారు. ఆ విషయం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు సక్సెస్ అయితే.. ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది.. తద్వారా కొంతమందికి ఉపాధి లభిస్తుందని చిరు చెబుతుంటారు. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన ఏ సినిమా అయినా సరే.. చిన్న, పెద్ద తేడా లేకుండా తన మద్దతును తెలుపుతారు. ఆ సినిమాకు ఆయన ఎంత వరకు సపోర్ట్ చేయగలరో అంతా చేస్తారు. అందుకు ఉదాహరణ రీసెంట్‌గా వచ్చిన హనుమాన్ సినిమానే.
ఇప్పుడు హనుమాన్ బాటలోనే మరో సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ అందిస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు సుందరం మాస్టర్. హర్ష చెముడు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఆర్టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలకు సిద్ధమవుతుండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ..
సుందరం మాస్టర్ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర అన్నట్లుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాతలు, దర్శకుడు ఈ చిత్రాన్ని తీశారు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని యూనిట్ చెబుతుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
Megastar Chiranjeevi Support to Sundaram Master:
Sundaram Master Trailer Launched by Megastar Chiranjeevi