రోజాకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడాను- బండారు
మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు, అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ స్పందించారు. ఈ కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో తన వైపు నిలబడిందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన…ఉరిశిక్షకైనా సిద్ధం తప్ప సీఎం జగన్ దుర్మార్గపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ నాలుగు నెలలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదన్నారు. నా సంతకం ఫోర్జరీ అయితే ఆ విషయం నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. మహిళల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆమెకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడానన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారన్నారు. మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను సీఎం కూడా విశ్లేషించుకోవాలన్నారు.