Mohammed Shami says My favourite actors from South are : భారత క్రికెటర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) క్రీడా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. పడి లేచిన తరంగం షమ్మీ. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. ఆ తర్వాత గాయంతో మళ్లీ భారత జట్టులో బరిలోకి దిగలేదు. చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన షమీ మీడియా తో మాట్లాడుతూ సౌత్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంటే తనకు ఇష్టమని చెప్పాడు. “నాకు సౌత్ ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం” అని అన్నారు ప్రభాస్. అలాగే సౌత్, నార్త్ ఇండస్ట్రీల గురించి మాట్లాడారు షమీ. “నేను ప్రాంతీయ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. నాకు సౌత్ మూవీస్ చాలా ఇష్టం. కానీ నాకు తమిళం, తెలుగు అర్థం కాదు..అందుకే డబ్బింగ్ సినిమాలు చూసేందుకు బాగుంటాయి” అని అన్నాడు. అలాగే హైదరాబాద్ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందన్న షమ్మీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా.. బిర్యానీ తినకుండా వెళ్లనన్నాడు.
గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లోనూ ఆడటం లేదు. . ఐపీఎల్ 2024 సీజన్‌లోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఒకప్పుడు భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గలేదు. ఇంకా దృఢంగా తయారయ్యాడు. చాలాకాలం వరకు జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపో లేదు. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నాడు.
మరోవైపు బెంగాల్ తరపున మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ రంజీ అరంగేట్రం చేశాడు. షమీ లాగే కైఫ్(Mohammed Kaif)కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్ మెరుగవడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్ చేశారు.