నారా వారి ఇంటి హీరో రోహిత్ మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడారు. ఇటీవల తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న విమర్శలు, పెదనాన్న చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపైన రోహిత్ లేఖ విడుదల చేశారు. జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు.
జగన్ ఎంపీ పదవి కోసం సొంత బాబాయ్ (వివేకానందరెడ్డి) పైనే చేయి చేసుకున్న చరిత్ర నీది అంటూ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మాకు పదవులు ముఖ్యం కాదని, అటువంటి చరిత్ర కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. కోర్టు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ విలువల గురించి అంటూ మండిపడ్డారు. సంక్రాంతి పండుగను మేము అందరం కలిసి ఆనందంగా జరుపుకుంటున్నాం. మా అందరికీ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను పెదనాన్న చంద్రబాబు ఎప్పుడూ ఇస్తూనే ఇస్తూనే ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
నా తండ్రి రామ్మూర్తినాయుడు తీవ్ర అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితం అయ్యారని. అతనికి వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రాజకీయం కోసం మా కుటుంబాన్ని రోడ్డుపైకి లాగొద్దని సూచించారు. 40 ఏళ్ల క్రితమే సమాజాభివృద్ధి కోసం మా ఆస్తులను రాసిచ్చామని వెల్లడించారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలకు తమ ఆస్తిని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మా కుటుంబాన్ని పెదనాన్న చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన నూటికి నూరుశాతం అవాస్తవం అని అన్నారు.