ByGanesh
Fri 16th Feb 2024 01:03 PM
నోరు అదుపులో పెట్టుకోకుంటే వీపు పగులుతుందని అంటుంటారు పెద్దలు. ఇది అక్షరాలా నిజం. ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా అయ్యిందంటే.. తిట్టడమే రాజకీయం అన్నట్టుగా మారింది. ఏపీలో అధికార పార్టీ.. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఇదే బాటను అవలంబిస్తున్నాయి. ఇక ఎలాగైనా నెట్టుకు రావాలంటే ఆంధ్రా వాళ్లను తిట్టాలి. ఇది తెలంగాణ నేతలు కొత్తగా అలవరుచుకుంటున్న రాజకీయం. పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టాలి. ఇప్పటి వరకూ కల్వకుంట్ల కుటుంబం చేసింది ఇదే. తెలంగాణను ఈ కుటుంబం పదేళ్ల పాటు సాంతం నాకి వదిలేసింది. దీంతో వీరి మాటలకు ఈసారి పడకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు.
మేఘా కృష్ణారెడ్డి ఆంధ్రావాడు కాదా?
ఇప్పుడు తెలంగాణలో తిరిగి పట్టు సాధించడం ఎలా? అన్న విషయమై నేతలంతా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండలి సాక్షిగా బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత.. చర్చలో భాగంగా టీఎస్‌పీఎస్సీలో ఇద్దరు ఆంధ్రా వాళ్లు ఉన్నారన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కవిత ఒకే ఒక్క మాటకు ఆమె చరిత్రంతా తవ్వి మరీ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం బీఆర్ఎస్‌ని ఓడించినా కూడా హైదరాబాద్‌లో 17 సీట్లు గెలుచుకోగలిగిందంటే దానికి ఆంధ్రా వాళ్లే కారణమని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఆంధ్రావాడు కాదా? అని నిలదీస్తున్నారు. అంతెందుకు.. నీ లిక్కర్ బిజినెస్ పార్ట్‌నర్ అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఆంధ్రవాడు కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీలో మాత్రం ఆంధ్రావాళ్లు వద్దా?
ఇక లిక్కర్ బిజినెస్ చరిత్రంతా తీసి కవితను ఒక్కాట ఆడుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువే కదా.. శరత్ చంద్రారెడ్డి అని ఏకి పారేస్తున్నారు. కేటీఆర్‌కి వ్యాపార భాగస్వాములైన రామలింగరాజు కొడుకులు, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లు, గ్రీన్ కో సంస్థ అధినేత అనిల్ గోపి వీళ్లంతా ఆంధ్రవాళ్లే కదా? అని నిలదీస్తున్నారు. మీకు అవసరమైతేనేమో ఆంధ్రావాళ్లు కావాలి.. టీఎస్‌పీఎస్సీలో మాత్రం ఆంధ్రావాళ్లు వద్దా? ఇదెక్కడి న్యాయం.. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమని ప్రశ్నిస్తున్నారు. మా టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్లు ఉన్నారు కదా.. ఈ లెక్కన వాళ్లను తీసేయాలా? అని నిలదీస్తున్నారు. ఏపీకి వచ్చి పార్టీ పెడతారు. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇలా మీకు అవసరం లేనప్పుడు మాత్రం రాష్ట్రాలను విడదీస్తారా? అని కవితకు ఊపిరి సలపకుండా ప్రశ్నలు సంధిస్తున్నారు.
Netizens Trolling On MLC Kavitha:
MLC Kavitha Comments On Andhra in Telangana Council