ByKranthi
Thu 28th Sep 2023 06:20 PM
కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేత ఒక్కో పీత. ఒకరు ఎదుగుతుంటే మరొకరు లాగేస్తుంటారు. ఇది ముఖ్యంగా టీ కాంగ్రెస్ పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితులు మారిపోయాయని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ మరోసారి కాంగ్రెస్ కీలక నేతలకు ఏమైందో ఏమో కానీ వ్యవహారం మొదటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. పార్టీ నేతలంతా అధికారం కోసం పట్టుబట్టుకుని కూర్చుండిపోతారు. అసలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా బీభత్సంగా క్రెడిట్ కొట్టేయవచ్చు. కానీ అదంతా పక్కనబెట్టి గొడవలు పెట్టుకుని పార్టీని అధోగతి పాలు చేశారు. సీనియర్లు అయితే మరీనూ. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాక పరిస్థితుల్లో కొంత మేర మార్పు అయితే వచ్చింది.
ఇక ఆ తరువాత కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీని తెలంగాణలో సైతం అధికారంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో గొడవలను పక్కనబెట్టేశారు. సీనియర్లు, జూనియర్లు అంతా ఏకమై.. బీఆర్ఎస్‌కు ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే అన్న స్థాయికి తీసుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలో మళ్లీ వార్ సైలెంట్‌గా మొదలైనట్లు పరిస్థితులను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. కొందరు సీనియర్లకు.. రేవంత్ రెడ్డికి అసలు పడటం లేదని సమాచారం. దీంతో మీడియా ఎదుట సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఆరోపణల్లో నిజమెంతో కానీ జనంలోకి ఈ పార్టీ నేతలు ఇక మారరన్న సంకేతాలను తీసుకెళుతున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహేశ్వరం టికెట్ కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారట. అంతేకాకుండా 5 ఎకరాల భూమి రాయించుకున్నారని మీడియా ముందు మనోహర్ రెడ్డి ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో దీనిని సాక్ష్యాలతో సహా బయట పెడతానంటూ సవాల్ కూడా విసిరారు. మొత్తానికి ఈ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొందరేమో.. అందులో నిజం లేదని కొట్టిపడేస్తుంటే.. మరికొందరు మాత్రం నిప్పులేనిదే పొగరాదంటున్నారు. ఏది ఏమైనా కూడా ఏమైనా ఉంటే పార్టీతో చర్చించుకోవాలి కానీ ఇలా మీడియా ముందుకెళ్లి రచ్చ చేయడం సరికాదంటున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
No Change in T Congress Leaders:
Manohar Reddy vs Revanth Reddy