Norman Pritchard Indias First Olympic Medallist: ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది…? విశ్వక్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఎప్పుడు వచ్చింది…? అసలు ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది ఎవరు..? ఏ విభాగంలో భారత్‌కు తొలి పతకం వచ్చింది..? ఈ పతకం అందించింది భారతీయుడేనా..? ఎందుకు ఆ దిగ్గజ క్రీడాకారుడి పౌరసత్వంపై విమర్శలు చెలరేగాయి…? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఉన్నాయి. చరిత్ర లోతుల్లోకి వెళ్తే అంతర్జాతీయ క్రీడా వేదికపై మన అథ్లెట్లు సాధించిన ఘనత తెలుస్తుంది.
తొలి ఒలింపిక్స్‌లోనే రెండు పతకాలు..
నార్మన్ గిల్బర్ట్ ప్రిచర్డ్ ( Norman Gilbert Pritchard)… ఎవరు ఇతను అనుకుంటున్నారు కదూ. ఈ పేరు మన భారతీయుల పేరులా లేదే అని కూడా అనుమానపడుతున్నారు కదూ. ఈ దిగ్గజ అథ్లెట్టే భారత్‌కు తొలి ఒలింపిక్స్‌లోనే రెండు పతకాలు అందించి అబ్బురపరిచాడు. ఇతను ఇలాంటి అలాంటి అథ్లెట్ కాదు. ఇతనికి దాదాపుగా అన్ని క్రీడల్లో ప్రవేశం ఉంది. క్రికెట్, రగ్బీ, ఫుట్‌బాల్ ఆటలో ఇతను నిష్ణాతుడు. 1899లో భారత్ తరపున ఫుట్‌బాల్‌లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన తొలి ఆటగాడిగానూ ప్రిచర్డ్ రికార్డు సృష్టించాడు. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన ప్రిచర్డ్ తొలి ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు అందించాడు. 1900వ సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్(Paris Summer Olympics in 1900)లో భారత్ తరపున పాల్గొన్న ఒకే ఒక అథ్లెట్ ప్రిచర్డ్. ఈ ఒలింపిక్స్‌లో ప్రిచర్డ్ 200 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. అంటే తొలి ఒలింపిక్స్‌లో ఒకే భారత అథ్లెట్ పాల్గొని… రెండు పతకాలు అందించాడన్న మాట.
పౌరసత్వంపై వివాదం
నార్మన్ ప్రిచర్డ్ పౌరసత్వం విషయంలో వివాదం నెలకొంది. బ్రిటన్, భారత్ రెండు దేశాల తరపున 1900 ఒలింపిక్స్‌లో పాల్గొన్నానని ప్రిచర్డ్ అప్పుడు ప్రకటించాడు. అయితే ప్రిచర్డ్ కోల్‌కత్తా(Calcutta)లో జన్మించాడు. అప్పుడు బ్రిటీష్ పాలనలో ఉన్న భారత్‌లోని కోల్‌కత్తాలో 23 ఏప్రిల్ 1875న ప్రిచర్డ్ జన్మించాడు. కోల్‌కత్తాలోనే సెయింట్ జేవియర్ కళాశాలలో ప్రిచర్డ్ చదువుకున్నాడు. ఇక్కడ చదువుకున్న తర్వాత 1900 ఒలింపిక్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు. అయితే బ్రిటీష్ తల్లిదండ్రులకు జన్మించిన ప్రిచర్డ్ అసలు భారతీయుడే కాదని… అతను బ్రిటీష్ పౌరుడే అన్న వివాదం కూడా ఉంది.
బ్రిటిష్ అమెచ్యూర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన ఆధారంగా ప్రిచర్డ్‌ను ఒలింపిక్స్‌కు ఎంపిక చేశారు. అయితే ఆ ఒలింపిక్స్‌లో ప్రిచర్డ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడ్డాడని బ్రిటిష్ చరిత్రకారులు చెప్తుంటారు. అప్పుడు భారత్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. 1920లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యత్వం పొందిన తర్వాత మాత్రమే భారత్ అధికారిక ఒలింపిక్‌కు జట్టును పంపింది. అయితే ప్రిచర్డ్ భారత్‌లో జన్మించినందున అతడు భారత పౌరుడేనని మరికొందరి వాదన. 1900 పారిస్ గేమ్స్‌లో ప్రిచర్డ్‌ను భారతీయ పాస్‌పోర్ట్, భారతీయ జనన ధృవీకరణ పత్రం ఆధారంగా అతడిని భారతీయుడిగానే గుర్తించారన్న వాదన ఉంది.
హాలీవుడ్‌లోనూ…
ప్రిచర్డ్ 1905లో వ్యాపార నిమిత్తం ఇంగ్లండ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో స్టేజీ ఆర్టిస్ట్‌గా ప్రిచర్డ్ కొనసాగాడు. హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన తొలి ఒలింపియన్ కూడా ఆయనే. హాలీవుడ్‌లో నార్మన్ ట్రెవర్ అనే పేరుతో 27 సినిమాల్లో ప్రిచర్డ్ నటించాడు. నార్మన్ ప్రిచర్డ్ 1929లో కాలిఫోర్నియాలో మరణించాడు. ప్రిచర్డ్ చాలా ఘనతలు సాధించాడు. అతను ఒలింపిక్ పతకం సాధించిన మొదటి ఆసియాలో జన్మించిన అథ్లెట్, హాలీవుడ్‌లో నటించిన మొదటి ఒలింపియన్. 1897లో భారత గడ్డపై అధికారిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి వ్యక్తి కూడా ప్రిచర్డే.
మరిన్ని చూడండి