ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్ భారీ స్కోరు చేసి విజయం సాధించాలని భావిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి సర్వత్రా విమర్శలు కురుస్తున్న వేళ.. మహా సంగ్రామంలో ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్ సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా గల్లంతవుతాయి. కాబట్టి పాక్ బ్యాటర్లు తొలుత మెరుగ్గా రాణించాలని కసిగా ఉన్నారు. ఇప్పటికే పాక్ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే దాయాది జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్ చేరకుండా ప్రపంచకప్‌లో పాక్ పోరాటం ముగుస్తుంది. కాబట్టి పాక్ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది.
ప్రొటీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడితే మిగిలిన మ్యాచుల్లో గెలిచినా పాక్‌కు ప్రయోజనం ఉండదు. వరుస ఓటములతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే పాక్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేమన్న నినాదం ఉంది. తమదైన రోజున ఎంత పటిష్టమైన జట్టునైనా పాక్ ఓడించగలుగుతుంది.
కాబట్టి దాయాది జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీస్ చేరే అవకాశం కూడా ఉంది. దక్షిణాఫ్రికా- పాక్ 82 మ్యాచ్‌లు ఆడగా 51 మ్యాచుల్లో ప్రొటీస్.. .30 మ్యాచుల్లో పాక్ గెలిచింది. ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓటమి తప్ప…. మిగిలిన మ్యాచ్‌ల్లో ప్రొటీస్ విధ్వంసం కొనసాగింది. క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మాక్రమ్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 155 ఫోర్లు, 59 సిక్సర్లు కొడితే.. పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు, 136 బౌండరీలు మాత్రమే చేయగలిగింది. మొదటి సఫారీ జట్టులో డి కాక్, క్లాసెన్, మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ 100కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తుండగా పాక్ బ్యాటర్లు మూడంకెల స్ట్రైక్ రేట్‌ను చేరుకోలేకపోయారు. ప్రతి పోరులోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న పాకిస్థానీలతో పోలిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉన్నారు.
పాక్ బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నా బౌలర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. బౌలింగ్‌లో షాహీన్ షా అఫ్రిది అంచనాల మేర రాణించలేక పోతున్నారు. హారిస్ రౌఫ్, హసన్ అలీ బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు చిత్తు చేస్తున్నారు. స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్ పిచ్‌లో పాకిస్థాన్‌కు నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం అతిపెద్ద బలహీనత. లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మీర్ ఎకానమీ రేటు 8 కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భీకర ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. డి కాక్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. పేసర్లు కగిసో రబడా, జాన్సెన్ మరియు గెరాల్డ్ కోయెట్జీ మెరుగ్గా రాణిస్తున్నారు. చెపాక్ పిచ్‌పై ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడం పాకిస్తాన్ బ్యాటర్లకు చాలా కష్టమైన పనే. కేశవ్ మహారాజ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.
పాకిస్థాన్ ఫైనల్ 11:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్.
దక్షిణాఫ్రికా ఫైనల్ 11:
టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మాక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్,