Inzamam ul Haq about PAkistan Cricket team: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024) లో పాక్ టీమ్ లీగ్ దశలోనే వెనుదిరిగడం ఆ దేశ క్రికెట్ పాతాళానికి పడిపోతుందనడానికి సంకేతమా..? పాక్ (Pakistan) జట్టు మరో వెస్టిండీస్, శ్రీలంక జట్ల తరహాలో పూర్తిగా పతనం కానుందా.? ప్రపంచకప్‌నకు ముందు ఐర్లాండ్… వరల్డ్‌కప్‌లో అమెరికా చేతిలో ఓటములు ఏం సంకేతాలు ఇస్తున్నాయ్..? ఆ దేశ మాజీ ఆటగాళ్ల తీవ్ర ఆందోళన వెనుక కారణమేంటీ ? పాక్ దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇంత బాధపడటం దేనికి సంకేతం..? జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరినీ జట్టులోంచి పీకి పారేయండంటూ దిగ్గజ ఆటగాళ్లు చేస్తున్న తీవ్ర విమర్శల్లో ఆంతర్యం ఏంటి..? పాక్ క్రికెట్ మరింత సంక్షోభంలో కూరుకుపోనుందా ? జట్టులోని పది మంది ఆటగాళ్ల ఆటను తాను ఆడలేను కదా అన్న కెప్టెన్ బాబర్ ఆజమ్ నిర్వేదం వెనుక ఉన్న లోతు ఎంత..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. తాజాగా పాక్ దిగ్గజ ఆడగాడు ఇంజమామ్ ఉల్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
పాక్ ప్రదర్శన ఇలా…
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఓటమి… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఓటములు… టీ 20 ప్రపంచకప్‌లోనూ లీగ్ దశలోనే ఓటమి ఇవీ పాకిస్థాన్ తాజా పరిస్థితులు. వరుసగా వైఫల్యాలు వెంటాడుతుండడం ఆ దేశ క్రికెట్‌నే సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. పాక్ ఆర్మీతో శిక్షణ ఇచ్చినా తమ జట్టు ఆటలో ఇసుమంతైనా మార్పు లేకపోవడం అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లను కలవరపెడుతోంది. భారత్ ఏడు, అమెరికా ఐదు పాయింట్లతో గ్రూప్ ఏ నుంచి సూపర్ ఎయిట్ చేరగా… పాక్ మొదటిసారి గ్రూప్ దశ నుంచే వైదొలిగింది.
ఇంజీ సంచలన వ్యాఖ్యలు
తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam ul Haq)… టీ 20 ప్రపంచ కప్‌లో తమ జట్టు ప్రదర్శనపై స్పందించాడు. అమెరికా, భారత్ చేతిలో ఓడి పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇంజీ భాయ్ తెలిపాడు. పాక్ జట్టు ప్రదర్శన క్షీణిస్తున్నట్లు అంగీకరించాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్‌కు తీవ్రమైన పోటీదారుగా భావించిన ఇంజిమామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవును పాక్ క్రికెట్ క్షీణిస్తోందని ఇంజీ భాయ్ తెలిపాడు. అవును తమ దేశ క్రికెట్ క్షీణిస్తోందని… అమెరికాపై ఓడిపోవడం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు. ప్రపంచకప్‌నకు ముందు కూడా ఐర్లాండ్ చేతిలో పాక్ ఓడిపోయిందని కూడా ఇంజీ గుర్తు చేశాడు.
స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో కూడా పాక్ ఓడిపోయిందని ఈ ఓటములన్నీ తమ జట్టు క్షీణిస్తుందనేందుకు నిదర్శనమని ఇంజీ కుండబద్దలు కొట్టాడు. T20 ప్రపంచ కప్ లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇప్పుడు పాక్ సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లపై ప్రభావం పడే ఆవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వడంపై మళ్లీ సమీక్ష జరపాలని కొంతమంది అధికారులు, మాజీ ఆటగాళ్ళు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సలహా ఇచ్చారని తెలుస్తోంది.
మరిన్ని చూడండి