PCB terminates pace ace Haris Rauf’s central contract: పాకిస్థాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్(Haris Rauf)కు పాక్ క్రికెట్ బోర్డు(PCB )దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు గాయం కారణంగా హారిస్ దూరంగా ఉన్నాడు. ఎలాంటి గాయం కానప్పటికీ ఉద్దేశ పూర్వకంతో హారీస్ ఆసీస్ పర్యటన నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. హరీస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ వరకు అతడు ఎటువంటి విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా చేసింది. ఇటీవల పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించగా.. ఆఖరి నిమిషంలో హారిస్ తప్పుకున్నాడు. సిరీస్‌లో ఆడాలని 10-15 ఓవర్లు బౌలింగ్ చేసినా చాలు అని టీమ్‌మేనేజ్‌మెంట్ అతడికి చెప్పినా హరీస్ అంగీకారం తెలపలేదు. అతడికి ఎటువంటి గాయం కాలేదు. మెడికల్ బృందం కూడా అతడు ఫిట్‌గా ఉన్నాడని బోర్డుకు నివేదిక ఇచ్చింది. సిరీస్‌కు ఆడకుండా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాడు. దీంతో పీసీబీ అతడిపై సీరియస్ అయ్యింది. హరీస్ నుంచి వివరణ కోరింది. ఈ స్టార్ బౌలర్ వివరణపై సంతృప్తి చెందని పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుకోవడంతో పాటు సరైన వివరణ ఇవ్వలేకపోయిన హరీస్ సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30, 2024 వరకు విదేశీ లీగుల్లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వమని చెప్పింది.
కొత్త అధ్యక్షుడు ఏం చేస్తాడో…
వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్ జట్టు(Pakistan Cricket team)కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. లాహోర్‌లో జరిగిన పీసీబీ అధ్యక్ష ఎన్నికలలో సయిద్ మోహ్సిన్ రజా నఖ్వీ(Mohsin Naqvi) పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బోర్డు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పీసీబీకి 37వ అధ్యక్షుడిగా ఎన్నికైన నఖ్వీ.. నేటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నఖ్వీ.. ఎంపిక గత నెలలోనే పూర్తైనా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ నేడు ముగిసింది. పీసీబీ తాత్కాలిక చీఫ్‌గా ఉన్న షా ఖవర్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరుపగా బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నఖ్వీని ఎన్నుకున్నారు. 2022లో రమీజ్ రాజా తర్వాత పీసీబీకి ఫుల్ టైమ్ చైర్మన్‌గా ఎన్నికైంది నఖ్వీనే. పాక్‌లో క్రికెట్ అభివృద్ధితో పాటు పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రొఫెషనలిజం తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని సయిద్ మోహ్సిన్ రజా నఖ్వీ తెలిపాడు. నఖ్వీ.. గతంలో అమెరికా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న CNN ఛానెల్లో పనిచేశాడు. తర్వాత పాకిస్తాన్‌కు వచ్చి పత్రికతో పాటు 24 న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్ కెప్టెన్సీ పదవికి బాబార్ ఆజమ్ రాజీనామా చేసినప్పుడు మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.