The Pakistan Cricket Board new decision: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఇప్పుడు ఎక్కడ విన్నా విమర్శలే వినిపిస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్(T20 Worls Cup) లీగ్ దశను కూడా దాటలేకపోయిన దాయాదిపై మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, ఫ్యాన్స్ ఇలా అందరూ ముప్పేట దాడి చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో లీగ్ దశలోనే వైదొలిగిన ఘటనను ఇంకా మర్చిపోకముందే మళ్లీ పొట్టి ప్రపంచకప్‌లోనూ అదే ఫలితం రావడంపై భగ్గుమంటున్నారు. ఈ దశలో పాక్ క్రికెట్‌లో సమూల మార్పులకు ఆ దేశ బోర్డు సమాయత్తం అయింది. అసలు చీఫ్ సెలక్టర్ లేకుండానే టీ 20 ప్రపంచకప్‌కు పాక్ జట్టును ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేయడంతో వైఫల్యాలు కొనసాగాయి. అందుకే ఈసారి పాత పద్ధతిలో జట్టును సెలెక్ట్ చేయాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అందుకోసం కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలని చూస్తోంది. అలాగే కొందరు ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని కూడా పాక్ క్రికెట్ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఛీప్ సెలెక్టర్‌గా వహాబ్ రియాజ్
టీ 20 ప్రపంచకప్‌లో సెలక్షన్ కమిటీలో భాగమైన మాజీ టెస్ట్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను పాక్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీబీ గతంలోలానే ఎనిమిది మంది సెలక్టర్ల విధానానికి మళ్లాలని నిర్ణయించుకున్న వేళ వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కమిటీలో పనిచేసిన వహాబ్.. ప్రపంచకప్ సమయంలో పాక్ జట్టు సీనియర్ మేనేజర్‌గా కూడా ఉన్నాడు. వాహబ్ రియాజ్… PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి అత్యంత సన్నిహితుడు. పంజాబ్‌కు తాత్కాలిక ముఖ్యమంత్రిగా నఖ్వీ ఉన్నప్పుడు అక్కడ క్రీడల సలహాదారుగా కూడా వాహాబ్‌ను నియమించారు.
పీసీబీ మాజీ చైర్మన్ జకా అష్రఫ్ మూడేళ్లపాటు ఆటగాళ్లకు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్టులను కూడా బోర్డు పునఃపరిశీలిస్తోంది. తక్కువ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో సరిగ్గా ఆడని ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు మళ్లీ ఇచ్చేందుకు పీసీబీ ఛైర్మన్ నఖ్వీ అంగీకారం తెలపడం లేదు. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇక పాత పద్ధతిలోనే…
టీ 20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే స్వదేశానికి పయనం కావడంతో పీసీబీ గతంలో ఉన్న సెలక్షన్ కమిటీ వ్యవస్థకు తిరిగి తీసుకురానుంది. ముగ్గురు సెలెక్టర్లు, చీఫ్ సెలెక్టర్, కెప్టెన్, ప్రధాన కోచ్ ఇలా ఎనిమిది మంది కూర్చొని ఇకపై పాక్ క్రికెట్ జట్టును ప్రకటించనున్నారు. ఇప్పటివరకూ ఇలా ప్రకటించకపోవడం వల్లే పాక్ జట్టు వైఫల్యాలు కొనసాగుతున్నాయని కూడా పీసీబీ ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా బోర్డును, సెలక్షన్ కమిటీని సంస్కరించాలని చూస్తోంది. పాక్ జట్టులోకి టాలెంట్ ద్వారా కాకుండా స్నేహం ద్వారానే ఎంపిక అవుతున్నారని ఇప్పటికే మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపైనా పాక్ క్రికెట్ బోర్డు దృష్టి పెట్టనుంది.
మరిన్ని చూడండి