వాటర్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టండి – కేటీఆర్KTR On Water Problem: కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందన్నారు కేటీఆర్. “ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టింది. ఢిల్లీకి డబ్బు సంచులు పంపడంపైన దృష్టి పెట్టారు. మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి రూ. 38 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం. కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కెసీఆర్(KCR) ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌లో ట్యాంకర్ల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయింది. మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రకృతి వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత. గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చింది..? పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు . వాటర్ ట్యాపింగ్‌పైన దృష్టి పెట్టండి. సాగర్‌లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్‌లో, ఉస్మాన్ సాగర్‌లో నీళ్లు ఉన్నా.. ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి..? తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి..? కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్.. నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారు..? బెంగళూరు మాదిరి నీటిని వాడితే జరిమానాలు విధించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుంది. నీటిని వృథా చేసినందుకు జరిమానా వేస్తే నీటిని ఎత్తిపోయకుండా గొంతులు ఎండబెట్టిన రేవంత్ రెడ్డి పైన ఎన్ని జరిమానాలు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి. తాగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తాం” అని కేటీఆర్ హెచ్చరించారు.
Source link