ByMohan
Sun 28th Jan 2024 09:07 AM
ఆదిపురుష్ సినిమాని నేనైతే ఇంకా బాగా తీసేవాడినని అన్నారు హను-మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో వచ్చిన హను-మాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయినప్పటికీ.. ఈ మధ్య కాలంలో లేని విధంగా.. ఇంకా ఈ సినిమాకు హౌస్‌ఫుల్స్ పడుతుండటం విశేషం. ఇప్పటికే రూ. 250 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి చరిత్ర సృష్టించిన ఈ సినిమా.. మున్ముందు మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునేలా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర సక్సెస్‌ని పురస్కరించుకుని ప్రశాంత్ వర్మ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో తాజాగా ఆదిపురుష్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్‌లో కొన్ని సీన్స్‌ని సరిగా తెరకెక్కించలేదు. వాటిని చూసినప్పుడు నేనైతే ఆ సీన్స్‌ని ఇంకా చక్కగా తెరకెక్కించేవాడిని అనే ఫీలింగ్ కలిగింది. నేనే కాదు.. ఏ దర్శకుడికైనా అది అనిపిస్తుంది. వాస్తవానికి కొన్ని సీన్లు చాలా బాగా తెరకెక్కించారు. కానీ కొన్ని సీన్లు నన్ను డిజప్పాయింట్ చేశాయి. నేను ఆ సీన్లు తీసి ఉంటే.. ఇంకా బాగా తీసేవాడిని. హనుమాన్‌పై ఆదిపురుష్ ప్రభావం ఏమీ లేదు. నా టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తో హనుమాన్ మూవీని నేను ఎలా అయితే అనుకున్నానో.. అంతకంటే గొప్పగా తీయగలిగాను.. అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ఆదిపురుష్ చూసిన వాళ్లంతా కాకపోయినా.. చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కథని మార్చి ఓం రౌత్ ఏదేదో చేశాడని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇన్ డైరెక్ట్‌గా అదే విషయం చెప్పాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హను-మాన్ సీక్వెల్ జైహనుమాన్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సీక్వెల్ మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు కసరత్తులు మొదలెట్టినట్లుగా ఆయన వెల్లడించాడు.
Prasanth Varma Sensational Comments on Adipurush:
Prasanth Varma Comments on Adipurush goes Viral