PV Sindhu Enters Second Round After Yvonne Li Retires: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ(All England Championship)లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) రెండో రౌండ్‌కు చేరింది. జర్మనీ ప్రత్యర్థి యొన్నె లి పై 21-10 తేడాతో తొలి సెట్‌ను సింధు సునాయసంగా గెలిచింది. తొలి రౌండ్ తర్వాత గాయం కారణంగా మ్యాచ్ నుంచి యొన్నె లి తప్పుకోవడంతో సింధును విజేతగా ప్రకటించారు. రెండో రౌండ్‌లో సింధు.. దక్షిణకొరియాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ అన్ సె యంగ్‌తో తలపడనుంది. ప్రపంచ 11వ ర్యాంకర్‌గా ఉన్న సింధు.. ఇటీవలే పారిస్ వేదికగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. అన్ సె యంగ్‌తో ఇప్పటివరకూ సింధు ఆరుసార్లు తలపడగా అన్నిసార్లు సింధుకు ఓటమే ఎదురైంది.
ఆకర్షి కశ్యప్ ఓటమి
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మరో భారత షట్లర్.. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి కశ్యప్ పరాజయం పాలైంది. చైనీస్ తైపీకి చెందిన 30వ ర్యాంకర్ యు పొ చేతిలో 16-21, 11-21 తేడాతో కశ్యప్ ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో 7వ సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూశాడు. ప్రణయ్ 14-21తో తొలి గేమ్‌ను చేజిక్కించుకున్నా.. ఆ తర్వాత రెండు సెట్లను 13-21, 13-21తో ఓటమిపాలయ్యాడు. నేడు జరిగే పోటీల్లో కిదాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్:
భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం చేసింది. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న ఈ జోడీ.. 2024 సీజన్‌లో మేజర్ టైటిల్ సాధించింది. సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి 2024 విజేతలుగా అవతరించి చరిత్ర సృష్టించారు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో చైనిస్ తైపీ జోడీ లీ ఝీ హుయ్, యాంగ్ పోపై 21-13, 21-16 తేడాతో సాత్విక్, చిరాగ్ శెట్టి వరుస సెట్లలో గెలుపొందారు. నెంబర్ వన్ జోడీ కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీపై విజయాన్ని అందుకుని.. తద్వారా ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ తొలి మేజర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన భారత జోడి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కంగ్ మిన్‌హైక్, సీయో సుఎంగ్జే జోడిపై సునాయసంగా విజయం సాధించింది. 21-13, 21-16తేడాతో వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వరుసగా మూడోసారి ఫ్రెంట్ ఓపెన్ ఫైనల్‌లో అడుగు పెట్టిన జోడీగా రికార్టు సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీ జోడీపై ఇదే ఆటను ప్రదర్శించి సీజన్ లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించారు. మలేషియా మాస్టర్స్, ఇండియా ఓపెన్ ఫైనల్లో ఓటమి చెందిన సాత్విక్, చిరాగ్ శెట్టి ఈసారి మాత్రం పట్టు విడవలేదు. ఈ ఏడాది జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం భారత జోడీకి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది.
మరిన్ని చూడండి