Ravichandran Ashwin becomes India’s leading wicket taker against England: ఇంగ్లాండ్(England)తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమిండియా(Team India) స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin )రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు పడగొట్టగా ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై ఇప్పటి వరకు ఏ టీమ్ఇండియా బౌలర్ కూడా వంద వికెట్లు తీయలేదు. అశ్విన్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై 97 వికెట్లు తీశాడు. అతడు మరో 3 వికెట్లు గనుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జేమ్స్ అండర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచులో అశ్విన్ మరో మూడు వికెట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 497 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రదర్శన 34 సార్లు నమోదు చేశాడు.
విజయం దిశగా టీమిండియా..
రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 194 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంకా విజయానికి బ్రిటీష్ జట్టు 205 పరుగుల దూరంలో ఉంది. క్రాలే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులు చేసిన క్రాలేను కుల్‌దీప్ అవుట్ చేశాడు. ఎల్బీ కోసం టీమిండియా అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. డీఆర్‌ఎస్ తీసుకున్న భారత్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో 194 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్ తీసుకుంది. సమీక్షలోనూ ‘అంపైర్స్ కాల్’ రావడంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ 127 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్లు మాత్రమే అవసరం. ఇంగ్లాండ్ గెలిచేందుకు 205 పరుగులు కావాలి. తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఓలీ పోప్ క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో 23 పరుగులు చేసిన ఓలీ పోప్ ఔటయ్యాడు.
గాయంతో గిల్ దూరం
ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో కె.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా రెండో టెస్ట్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్ శుభ్‌మన్ గిల్‌కు గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండో రోజు ఆట సందర్భంగా గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. అయితే ఇప్పుడు అతడికి వేలి నొప్పి ఎక్కువగా ఉండడంతో నాలుగో రోజు గిల్ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఫీల్డింగ్‌లో శుబ్‌మన్ చేతి వేలికి గాయమైందని… నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంటాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. గిల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ.