Sunrisers Hyderabad won by 25 runs: చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు సునామీల విరుచుకుపడి బెంగళూరు(RCB) జట్టును ముంచేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్… ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. మరోసారి ఉప్పెనలా మారి బెంగళూరుపై విరుచుకపడింది. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ రాణించినా.. ఆ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది.
ఊచకోతను మించి..
చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది. సిక్సులతో తడిసి ముద్దయింది. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే సింగల్ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో… బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. బెంగళూరు వేసిన ప్రతీ బంతి బౌండరీనే అనేలా సాగింది హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం. మాధ్యు హెడ్ శతక గర్జన చేసిన వేళ… హెన్రిచ్ క్లాసెన్ తన మార్క్ విధ్వంసంతో చెలరేగిన సమయాన… హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో మార్పులు చేసుకుని బరిలోకి దిగినా బెంగళూరు బౌలింగ్ ఏమాత్రం బలపడలేదు. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్.. 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో హెడ్ 102పరుగులు చేశాడు. క్లాసెన్ కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మార్క్రమ్ 17 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సులతో 37 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది.
పోరాడినా సరిపోలేదు
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరు ఏమైన అద్భుతం చేస్తుందా అనిపించింది. కానీ హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. 20 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లీని మార్కండే బౌల్డ్ చేశాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేసిన డుప్లెసిస్‌ను కమిన్స్ అవుట్ చేశాడు. విల్ జాక్స్ రనౌట్ అవ్వగా… రజత్ పాటిదార్ 9, శామ్ కరణ్ డకౌట్ కావడంతో బెంగళూరు విజయావకాశాలు మూసుకుపోయాయి. కానీ మంచి ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తిక్ అర్ధ శతకంతో మెరిశాడు. కార్తిక్ పోరాటంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి