Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం (మార్చి 6) ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకాబోతున్నారు. రేపు లోక్ సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో చాలా వరకూ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను ఏఐసీసీ పరిశీలించిన అనంతరం విషయం తెలిసిందే.
మరోవైపు రేపే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా కూడా విడుదల అవుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ రెడ్డికి అధిష్ఠానం అప్పజెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు వివరించబోతున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే తమకు వీలైనంత మేరకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఏకాభిప్రాయంతో ఉన్న సీట్ల వరకూ రేపు ఏఐసీసీ ప్రకటించనున్నట్లు తెలిసింది. మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేయడానికి సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన అని చెబుతున్నారు.
రేవంత్ ఢిల్లీ పర్యటనతో మిగతా కార్యక్రమాలు రద్దు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కావడం వల్ల ఆయనకు ముందే ఖరారైన ఇతర కార్యక్రమాలు అన్నీ రద్దు అయ్యాయి. రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ పర్యటన ముందే ఫిక్స్ కాగా ఢిల్లీ పర్యటన కారణంగా రద్దయింది. మార్చి 7న సీఎం పర్యటనలు అన్ని రద్దు అయినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మార్చి 7న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్బంగా సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ముందే షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలి. అయితే సీఎం పర్యటన రద్దుతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేములవాడలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 7న షెడ్యూల్ ప్రకారం సిరిసిల్లలో నూతన ఎస్పీ భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు భూమి పూజ చేయాల్సి ఉంది.
మరిన్ని చూడండి