Rohit Sharma About Yashasvi Jaiswal : రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్ ద్వి శతక గర్జనతో బ్రిటీష్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
రోహిత్ ఏమన్నాడంటే….
ఇంగ్లాండ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడి తమను ఒత్తిడిలోకి నెట్టారని రోహిత్ అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని… ప్రత్యర్థి బ్యాటర్లు బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఉండాలని తమ బౌలర్లకు చెప్పానని రోహిత్ తెలిపాడు. కానీ మూడో రోజు తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారని తెలిపాడు. టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులపైనే దృష్టి పెట్టుద్దని… చివరి రోజు వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నామని హిట్ మ్యాన్ తెలిపాడు.
ఆకట్టుకున్న రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని రోహిత్ తెలిపాడు. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అన్నాడు. వారిద్దరూ మాకు కావాల్సిన ఆధిక్యాన్ని అందించారుని జైశ్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడొక అద్బుతం.. ఇదే విషయంపై చాలా సార్లు ఇప్పటికే చెప్పానని తెలిపాడు. యశస్వీ భవిష్యత్తులో కచ్చితంగా వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని హిట్ మ్యాన్ తెలిపాడు.
రికార్డుల మోత
భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో బ్రిటీష్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్… వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. జైస్వాల్ తర్వాత 855 పరుగులతో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఉన్నాడు. టీమిండియా తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ పేరిట ఉన్న 535 పరుగుల రికార్డును 545 పరుగులతో యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు.