Why do RCB wear green jerseys during IPL: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్-2024 ప్రారంభ మ్యాచ్‌లో బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్(CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆర్‌సీబీ(RCB) ప్లేయర్లు చెన్నై చేరుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ఉదయం బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీని ధరించారు. ఆర్‌సీబీ 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతోంది.
పర్యావరణ హితం కోరుతూ ఇలా బెంగళూరు ప్లేయర్లు ఏదో ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో కనిపిస్తారు. ఈ నేపధ్యంలో ఐపీఎల్-17కు సంబంధించిన గ్రీన్ జెర్సీని జట్టు సభ్యులు రివీల్ చేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్లు గ్రీన్ జెర్సీలో మెరిశారు. అంతకు ముందు జరిగిన అన్బాక్సింగ్ ఈవెంట్లో ఈ టీమ్ కొత్త జెర్సీతో పాటు పేరును రివీల్ చేసింది. తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇప్పటి వరకు ‘Royal Challengers Bangalore’ కాస్త ‘Royal Challengers Bengaluru’ గా రూపాంతరం చెందినట్లు వెల్లడించింది. “మేం ఇష్టపడే నగరం, గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం ఇది మా సరికొత్త అధ్యాయం. మీ జట్టు, మీ ఆర్సీబీ” అంటూ ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్ ఫ్రాంచైజీ కొత్త కిట్‌ను కూడా విడుదల చేసింది, ఇది 2016 నుండి వారు ధరిస్తున్న నలుపు మరియు ఎరుపు నుండి కొద్దిగా మార్పు చేయబడింది. కొత్త కిట్‌లో సాంప్రదాయ నలుపు రంగుకు బదులుగా నేవీ బ్లూ కలర్‌ను ఉపయోగించారు.
మార్చి 22న ఐపీఎల్ మహా సమరం ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే తొలి దశ మ్యాచ్‌ల కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చెపాక్‌లో చెత్త రికార్డును, బెంగళూరు అధిగమిస్తుందా ?
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చెపాక్ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈసారి చెన్నైకు బెంగళూరు చెక్ పెడుతుందని అభిమానులు గంపెడాశలతో ఉన్నారు. మహిళల జట్టు ఇప్పటికే WPL టైటిల్ గెలచుకుందని… ఇక ఆర్సీబీ కూడా తమ ఆశలను నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని చూడండి