ప్రభాస్ హీరోగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ మూవీ కోసం ప్రభాస్‌తో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం కావడంతో భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ధియేటర్ లో విడుదలయిన కొద్ది గంటలకే తమిళ్ రాకర్స్ వెబ్ లో ప్రత్యక్షమైంది. కాగా ఎప్పటి నుంచో తమిళ్ రాకర్స్ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న తమిళ్ రాకర్స్ వెబ్ సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ)ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల మహేష్ బాబు ‘మహర్షి’ని థియేటర్లో విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ ఆన్లైన్లో లీక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాహో మూవీని సైతం విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ లీక్ చేయడం గందరగోళానికి దారితీసింది.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ నటించిన మూవీ కావడం, హాలీవుడ్ రేంజ్ టేకింగ్స్‌తో భారీ బడ్జెట్ మూవీగా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ తన బుద్ధి చూపించడంతో ఒక్కసారిగా నిర్మాతలు షాక్ తిన్నంత పనిచేశారని సమాచారం. ఈ టీమ్ ఆన్‌లైన్‌లో సాహో మూవీ హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసి మూవీ నిర్మాతలకు గట్టి షాకిచ్చింది.
ఇదివరకే సాహో మూవీ సక్సెస్ కావాలని, యాక్షన్ సీన్లను ఎంజాయ్ చేయాలని కోరుతూ సినిమా విడుదలకు ముందే యూవీ క్రియేషన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పైరసీ లాంటివి గమనిస్తే తమకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలంటూ సాహో, వరల్డ్ సాహో డే అనే హ్యాట్ ట్యాగ్స్‌తో పోస్ట్ చేసింది. అయినప్పటికీ సాహో లీక్ అవడం కొంచెం ఇబ్బందికర అంశమేనని చెప్పాలి. ఇదివరకే మహర్షి ఎన్టీఆర్ కథానాయకుడు, డియర్ కామ్రెడ్, వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ ఇలా ఎన్నో సినిమాలను తమిళ్ రాకర్స్ ఆన్లైన్లో లీక్ చేసి ఆ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.