Saina Nehwal slams Congress MLAs fit to cook jibe at BJP woman leader: ఒక మహిళా ఎంపీ అభ్యర్థిని టార్గెట్ చేసే క్రమంలో మహిళలు కిచెన్‌కే పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నారీశక్తికి అవమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని సూచించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) లో సీనియర్ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్త్రీలను వంటగదికే పరిమితం చేయాలి అన్న శివశంకరప్ప వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.” మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలంట — కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చెబుతున్నారు” అంటూ మోదలు పెట్టిన సైనా .. లడ్కీ హూ, లడ్ శక్తి హూ అని, అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి తాను ఊహించలేదన్నారు. తాను మైదానంలో ఆడి భారత్‌కు పతకాలు సాధించినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందని, తాను ఎలా ఉంటే బాగుండేది అనుకుందని ప్రశ్నించారు. ఓవైపు నారీశక్తికి వందనం అని చెబుతూనే.. మహిళలు పలు రంగాల్లో ఎదగాలని పెద్ద పెద్ద కలలు కంటున్నప్పుడు ఇలా ఎందుకు కించపరుస్తున్నారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరోవైపు, కొంతమంది నుంచి వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలతో మహిళలకు అవమానం జరుగుతోందన్నారు . ఈ విషయంపై తాను నిజంగా కలత చెందుతున్నానన్నారు. ఇలాంటి దృక్కోణాల నుంచి బయటపడాలని సూచించారు.
శివశంకరప్ప ఏమన్నారంటే..?
కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ బీజేపీ అభ్యర్థి గా ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శివశంకరప్ప కోడలు ప్రభా మల్లికార్జున్. ప్రచారంలో భాగంగా గాయత్రి సిద్దేశ్వరను ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ ఆమెకు ‘‘ఆమెకు సరిగా మాట్లాడటం కూడా రాదు. కేవలం కిచెన్‌లో ఎలా వంట చేయాలో మాత్రమే తెలుసు. ఆమె దానికే సరిగ్గా సరిపోతారు’’ అని అన్నారు. ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ విషయంపై గాయత్రి సిద్దేశ్వర కూడా ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఆడవాళ్లు అన్ని వృత్తులలోనూ ఉన్నారు, ఆకాశంలో కూడా ఎగురుతున్నాం. ఆడవాళ్లు ఎంత అభివృద్ధి చెందారో వయసు అయిపోయిన అతనికి తెలియదు, అంతెందుకు ఆడవాళ్లందరూ ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు, పెద్దవాళ్లకు ఎంత ప్రేమతో వంట చేస్తారో కూడా తెలియదు అంటూ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. మరోవైపు కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
మరిన్ని చూడండి