బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోమ్ క్వారంటైన్‌లోకి (Salman Khan in Self-Isolation) వెళ్లాడు.తన వ్యక్తిగత డ్రైవర్, ఇద్దరు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటంతో తన కుటుంబంతో కలిసి 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. తన సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ (COVID-19 Positive) అని తేలిన వెంటనే వారిని ముంబై ఆసుపత్రిలో చేర్పించాడు. వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సల్మాన్ పేరెంట్స్ సలీం ఖాన్- సల్మా ఖాన్ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సైతం రద్దు చేశారు.
ఇదిలా ఉంచితే హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న బిగ్‌బాస్-14 రియాల్టీ షోకు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో హిందీ బిగ్‌బాస్ హోస్టింగ్ వ్యవహారం సందిగ్థంలో పడింది. 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్న సల్మాన్ ఖాన్.. తాను మళ్లీ తిరిగి పాల్గొనే వరకూ వేరే వాళ్లకు బిగ్‌బాస్-14 హోస్ట్ బాధ్యతలను అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సందరర్భంలో సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పాన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో తనను తాను నిర్బంధించుకున్నాడు. ఈ నటుడు తన కుటుంబ సభ్యులు ,స్నేహితులతో ఫామ్‌హౌస్‌లో సరదాగా గడపడమే కాకుండా, వ్యవసాయం కూడా చేశాడు. దీనిలో భాగంగా అతను ఫామ్‌హౌస్ నుండి కరోనావైరస్ అవగాహన వీడియోలను కూడా విడుదల చేశాడు.