Sania Mirza Shoaib Malik Divorce: హైదరాబాద్: స్టార్ కపుల్ సానియా మీర్జా(Sania Mirza), షోయబ్ మాలిక్(Shoaib Malik) విడాకులు తీసుకున్నారు. గత కొంతకాంలం నుంచి జరుగుతున్న ప్రచారం వదంతులు కాదని, నిజమేనని రుజువైంది. సానియాతో 14 ఏళ్ల పెళ్లి బంధానికి పాక్ క్రికెటర్ షోయబ్ వీడ్కోలు పలికాడు. సానియా మీర్జాతో విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను వాస్తవమేనని రుజువు చేస్తూ.. షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. నటి సనా జావెద్‌తో ఉన్న ఫొటోలను షోయబ్ మాలిక్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. షోయబ్ మాలిక్- సానియా విడిపోతున్నట్లు చాలా ఏళ్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై సానియా తండ్రి స్పందించాడు. తన అల్లుడు షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్(Sana Javed)ను పెళ్లి చేసుకున్నారని ప్రపంచానికి తెలిసిన సందర్భంగా సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం షోయబ్ మాలిక్, సానియా విడిపోయారని స్పష్టం చేశారు. ముస్లిం లా ‘ఖులా’ ప్రకారం విడిపోయారని.. ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును ఖులా సూచిస్తుందని తెలిపారు.
స్పందించిన సానియా మీర్జా
సానియా తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుందని ఈ టెన్నీస్ స్టార్ తరపున ఒక ప్రకటన విడుదలైంది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు పంచుకోవాల్సి వచ్చిందని… షోయబ్ మాలిక్‌తో కొన్ని నెలల కిందటే సానియా విడాకులు తీసుకుందని సానియా తరపున విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే షోయబ్ కొత్త ప్రయాణం బాగుండాలని కోరుకుంటూ సానియా శుభాకాంక్షలు తెలిపిందని… ఈ సమయంలో సానియా గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నామని సానియా తరపున ప్రకటన విడుదల చేశారు. ఈ సున్నితమైన సమయంలో అభిమానులు… శ్రేయోభిలాషులందరూ ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా సానియా గోప్యతను పాటించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
2010లో ప్రేమ వివాహం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.