Sanju Samsons Crazy Record : ఐపీఎల్(IPL)లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో శాంసన్ చెలరేగాడు. మొత్తం 52 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్.. 3 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 50కుపైగా పరుగులు సాధించి శాంసన్ చరిత్ర సృష్టించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించడం శాంసన్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో నాలుగుసార్లు శాంసన్ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వరుసగా 5 సీజన్లలో ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీకిపైగా పరుగలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు.
సంజు శాంసన్ 2020లో చెన్నైపై 74, 2021లో పంజాబ్ కింగ్స్‌పై 119, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, తాజాగా లక్నోసూపర్ జెయింట్స్‌పై 82 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సార్లు 50కుపైగా స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్, అజింక్య రహానేతో కలిసి శాంసన్ మొదటి స్థానంలో నిలిచాడు.
మ్యాచ్ సాగిందిలా…
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌కు.. ఆదిలోనే షాక్ తగిలింది. నవీనుల్ హక్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఉన్నంతసేపు చురుగ్గా కదిలాడు. 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు బాది 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్.. నవీనుల్ హక్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్.. రియాన్ పరాగ్ సహకారంతో స్కోర్ బోర్డు జోరు పెంచాడు. సంజు శాంసన్ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత సంజు దూకుడు కొనసాగించాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రియాన్ పరాగ్‌ను నవీనుల్ హక్ అవుట్ చేశాడు. 29 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్సులతో 43 పరుగులు చేసి రియాన్ పరాగ్ వెనుదిరిగాడు. దీంతో 142 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. కాసేపటికే హెట్‌మయర్‌ను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. చివర్లో ధ్రువ్ జురెల్ మెరుపులతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
లక్ష్య ఛేధనలో డీలా..
194 పరుగుల లక్ష్య చేధనలో లక్నోకు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. కాసేపటికే దేవదత్ పడిక్కల్ డకౌట్ అయ్యాడు. తర్వాత బదోని కూడా పెలివియన్ చేరడంతో లక్నో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రాహుల్..దీపక్ హుడా లక్నో స్కోరు బోర్డును కాసేపు ముందుకు నడిపించారు. కానీ 13 బంతుల్లో 26 పరుగులు చేసిన హుడాను చాహల్ అవుట్ చేసి లక్నోను దెబ్బ తీశాడు. తర్వాత పూరన్‌తో జతకలిసిన రాహుల్ మళ్లీ గెలుపు ఆశలు రేపాడు. పూరన్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. రాహుల్ కూడా 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో లక్నో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
మరిన్ని చూడండి