Sarfaraz Khan Heaps Praise On Brother : దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్(Vizag) వేదికగా ఇంగ్లండ్(England)తో జరగనున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరం కానుండటంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతణ్ని కరుణించింది. రెండో టెస్ట్‌లో తుది జట్టులో చోటు దక్కితే రాణించి స్థానం పదిలం చేసుకోవాలని సర్ఫరాజ్ ఖాన్ పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు టెస్ట్ జట్టులో చోటు దక్కడంపై సర్ఫరాజ్ స్పందించాడు. తన సోదరుడి స్ఫూర్తితో రాణిస్తానని ఈ బ్యాటర్ ధీమా వ్యక్తం చేశాడు.
అండర్ 19లో సోదరుడి జోరు
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ –19 వరల్డ్ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(Musheer Khan) అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు , మరో అర్థ సెంచరీతో జోరుమీదున్నాడు. తాను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు సోదరుడు ముషీర్ ఖాన్ ఆటతీరును గమనిస్తానని సర్ఫరాజ్ తెలిపాడు. ముషీర్ తన కంటే మంచి బ్యాటర్ అని అన్నాడు. తన సోదరుడి టెక్నిక్‌ని గమనిస్తూ దానిని అనుకరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తన సోదరుడి ఆటతీరు తనకు నమ్మకాన్ని ఇస్తుందని సర్ఫరాజ్ తెలిపాడు. తాను బాగా బ్యాటింగ్ చేయలేనప్పుడు ముషీర్ ఖాన్‌ని చూసి నేర్చుకుంటానని అన్నాడు. తాను స్వీప్ బాగా ఆడతానని అనుకుంటున్నానని. మా ఇద్దరి మధ్య ఎల్లప్పుడూ పోటీ ఉంటుందని సర్ఫరాజ్ తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సర్ఫరాజ్ ఎంతో నేర్చుకున్నాడని… అతనిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు.. అతడికి మద్దతుగా నిలిచిన అభిమానులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ అన్నారు.
దేశవాళీలో రికార్డుల మోత
26 ఏళ్ల సర్ఫరాజ్..ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులోనూ అతడు 96 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.85 యావరేజ్‌తో 3912 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు .
సిద్ధమవుతున్న టీమిండియా
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ సేన… ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్, జడేజా గాయం కారణంగా రెండో టెస్ట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలర్ అవసరం లేనపుడు మహ్మద్ సిరాజ్‌ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.