SBI Debit Card Charges From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు పెద్ద షాక్ తగలబోతోంది. ఈ ప్రభుత్వ బ్యాంక్, తన వివిధ డెబిట్ కార్డ్‌ల (ATM కార్డ్) వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని రూ. 75 వరకు బ్యాంక్ పెంచబోతోంది. డెబిట్ కార్డ్‌ల కొత్త వార్షిక నిర్వహణ ఛార్జీలు (Annual maintenance charges) 01 ఏప్రిల్ 2024 (కొత్త ఆర్థిక సంవత్సరం) నుంచి అమలులోకి వస్తాయి. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు SBI డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా SBI దేశంలోనే అతి పెద్ద బ్యాంక్.
ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లపై చార్జీల బాదుడు ఈ విధంగా ఉంటుంది..– క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు 01 ఏప్రిల్ 2024 నుంచి నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది. — యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 175 + GSTకి బదులుగా రూ. 250 + GSTని బ్యాంక్ వసూలు చేస్తుంది. — ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడున్న రూ. 250 + GSTకి బదులుగా రూ. 325 + GSTని వసూలు చేస్తుంది. — ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుత రూ. 350 + GST నుంచి రూ. 425 + GSTకి పెరుగుతుంది.
రివార్డ్ పాయింట్లు కూడా రద్దు SBI క్రెడిట్ కార్డ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థ ఎస్‌బీఐ కార్డ్ (SBI Card), తన కొన్ని క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లకు సంబంధించి, ఏప్రిల్ 01 నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్ ప్రకారం, కొంతమంది ప్రత్యేక క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇకపై క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్ ప్రయోజనాన్ని పొందలేరు.
ఇప్పటికే కూడబెట్టిన రివార్డ్ పాయింట్లపైనా ప్రభావం అదే సమయంలో, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరో నష్టాన్ని కూడా చవిచూడబోతున్నారు. SBI కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రభావిత కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించడం ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్‌ల గడువు 15 ఏప్రిల్ 2024తో ముగుస్తుంది. అంటే, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అద్దె చెల్లించి, అందుకోసం కొన్ని రివార్డ్ పాయింట్‌లను పొందినట్లయితే, వాటిని ఇప్పుడే ఉపయోగించండి. లేకపోతే, 15 ఏప్రిల్ 2024 తర్వాత ఆ రివార్డ్ పాయింట్లు చెల్లుబాటు కావు.
మరో ఆసక్తికర కథనం: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
మరిన్ని చూడండి
Source link