ByGanesh
Thu 08th Feb 2024 10:19 AM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్న షర్మిల అనుకున్న దానికి మించి దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ఆమె నియమితులవుతున్నారనగానే ఆమె తన అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఎదిరించగలిగితే పరిస్థితే ఉండి ఉంటే ఆమె తెలంగాణకు వెళ్లి పార్టీ పెట్టుకునే వారు కాదు కదా. ఏపీలోనే పార్టీ పెట్టి ఉండేవారు. కానీ తట్టా బుట్టా సర్దుకుని అన్న వెళ్లగొట్టగానే తెలంగాణకు వచ్చేశారు. ఈ కారణాలతో ప్రతి ఒక్కరూ తన అన్నకు షర్మిల ఎదురెళ్లరనే భావించారు. కానీ షర్మిల మాత్రం అన్నకు సినిమా చూపిస్తున్నారు.
బీజేపీకి ఎదురెళ్లిన వారు లేరు
అన్నా అన్నా అంటూ సంబోదిస్తూనే ఆయనను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఏపీ గల్లీలో అన్నను నిలదీస్తూనే.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి షర్మిల గట్స్‌ను అయితే మెచ్చుకుని తీరాల్సిందే. అన్నను నిలదీయడమే కాదు.. అటు కమలం పార్టీని సైతం ఏకి పారేస్తున్నారు. ఇప్పటి వరకూ బీజేపీకి ఏపీ నుంచి ఎదురెళ్లిన వారు లేరు. ఏపీలో ఆ పార్టీకి ఏమాత్రం బలం లేకున్నా కూడా అధికార, విపక్ష నేతలంతా లొంగే ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీకి ఎదురు తిరిగారు కానీ ఆ తరువాత ఆయన కూడా సైలెంట్ అయ్యారు.
మణిపూర్ అంశాన్ని లేవనెత్తి..
ఏపీకి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడమంటే ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించడమే. దీంతో షర్మిలపై బీజేపీ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉందని టాక్. అలాగే ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే మణిపూర్ అంశాన్ని లేవనెత్తి బీజేపీని ఏకి పారేశారు. ఇక ప్రతిరోజూ ప్రత్యేక హోదా అంటూ బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో అన్ని పార్టీలు మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేపట్టారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. అలాగే కాంగ్రెస్ నేతలతో పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టించారు. ఇవన్నీ బీజేపీకి కోపం తెప్పించేవే. మరి దీనికి ప్రతిగా బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.
Sharmila has to accept Guts..!:
BJP has no opponents