<p>ShivaBalakrishna Corruption Case: హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్అయిన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణ (ShivaBalakrishna) ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ తరఫు లాయర్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు గుర్తించామని చెబుతున్నట్లుగా అభియోగాలలో పేర్కొన్నంత ఆదాయం, ఆస్తులు లేవని పిటీషన్‌లో పేర్కొన్నారు.</p>
<p>శివ బాలకృష్ణ (ShivaBalakrishna) అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ అథారిటీ (Hmda) డైరెక్టర్‌గా పని చేసిన శివ బాలకృష్ణ… 6 నెలల క్రితమే రెరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ (Acb)సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయలను ఆస్తులను గుర్తించిన ఏసీబీ… శివబాలకృష్ణను కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేసింది. ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన భూముల వ్యవహారాలపై దృష్టి సారించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.</p>
Source link