పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే 17 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. కువైట్‌లో జరుగుతున్న ఏషియన్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్(Asian Shotgun Championships)లో పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్(Anant Jeet Singh Naruka) రజత పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకున్న అనంత్‌జీత్‌సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. స్కీట్ విభాగంలో స్వర్ణం గెలిచిన చైనీస్ తైపీ షూటర్ లీ మెంగ్ యువాన్ కంటే అనంత్‌జీత్ ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు.
మహిళల స్కీట్ విభాగంలో రైజా ధిల్లాన్( Raiza Dhillon) సైతం రజతం దక్కించుకుంది. 52 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత షూటర్ మహేశ్వరి చౌహాన్ 43 స్కోరుతో కాంస్యం గెలుచుకుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అందుకే మహేశ్వరి చౌహాన్‌కు అవకాశం దక్కలేదు. అనంత్‌జీత్ , రైజా ధిల్లాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య 19కు చేరింది.
విజయ్‌వీర్ సిద్ధూ కూడా….
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్‌లో విజయ్‌వీర్ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్(Asia Olympic Qualifiers) టోర్నీలో విజయ్‌వీర్ రజత పతకం గెలిచి విశ్వక్రీడలకు బెర్త్ ఖాయం చేశాడు. క్వాలిఫయింగ్ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు.
ఇప్పటికే రిథమ్ సాంగ్వాన్…
ఈ ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్(2024 Paris Olympics)లో పాల్గొనేందుకు మరో భారత షూటర్ బెర్త్ ఖాయం చేసుకుంది. హరియాణా యువ షూటర్ రిథమ్ సాంగ్వాన్ భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే 16వ షూటర్‌గా నిలిచింది. సాంగ్వాన్ ఆసియా క్వాలిఫయర్స్(Asia Qualifiers 2024) మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. 20 ఏళ్ల రిథమ్ సాంగ్వాన్‌కు ఆసియా క్వాలిఫయర్స్‌లో ఇది మూడో పతకం కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అర్జున్ చీమాతో కలిసి రజత పతకం అందుకుంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ లో భారత షూటర్లు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్ (Esha Singh)పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.