కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. గతంలో ఆమె ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో గతంలో కన్నా ఇప్పుడు మరింత బలపడింది. ఖమ్మం అసెంబ్లీ స్థానాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఖమ్మం నుంచి పోటీకి చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన వారంతా పార్టీకి వ్యతిరేకమవుతారు. కాబట్టి సోనియాను ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.
ఖమ్మం నుంచి సోనియా ఫిక్స్..
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్లి ఢిల్లీలో సోనియా గాంధీని స్వయంగా కలిశారు. సోనియాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఆమె ఓకే అన్నారు. దీంతో ఖమ్మం నుంచి సోనియా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తన వయసుతో పాటు ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో సోనియా పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ కారణాలతో తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేనని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని టాక్.
ప్రియాంక సైతం పోటీ చేయాలని భావించారట..
కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తంగా 10 స్థానాలు దక్కుతాయి. వాటిలో కర్ణాటక నుంచి 3, తెలంగాణ నుంచి 2, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ఒకటి చొప్పున స్థానాలు దక్కుతాయి. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలని సోనియా భావిస్తున్నారట. ఇక తెలంగాణ నుంచి పోటీకి చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రియాంక గాంధీ సైతం ఏదో ఒక రాజ్యసభ స్థానం నుంచి ఈసారి పోటీ చేయాలని తొలుత భావించారని సమాచారం. అయితే ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికలంటేనే భయపడుతున్నారని.. అందుకే దొడ్డిదారిన పోటీకి సిద్ధమవుతున్నారంటూ విమర్శలు చేయడంతో ప్రియాంక డ్రాప్ అయ్యారని సమాచారం. ఇక సోనియా పోటీ విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.