Sovereign Gold Bond Scheme 2024 – Calculator: 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్‌లో నాలుగో విడత సబ్‌స్క్రిప్షన్ సోమవారం (12 ఫిబ్రవరి 2024) నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు ఓపెన్‌లో ఉండే ఈ అవకాశం ఈ నెల 16న (శుక్రవారం) ముగుస్తుంది.
ఒక సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాము బంగారానికి సమానం. ప్రస్తుత విడతలో, ఒక SGB లేదా ఒక గ్రాము బంగారం ధరను రూ. 6,263 గా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి లేదా డిజిటల్ మోడ్‌లో డబ్బు చెల్లించే వాళ్లకు ఒక్కో గ్రాముకు 50 రూపాయల చొప్పున డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ తరహా ఇన్వెస్టర్లకు ఒక్కో గోల్డ్ బాండ్/గ్రాము గోల్డ్ రూ. 6,213 కే అందుబాటులో ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? (What is Sovereign Gold Bond Scheme?)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఈ గోల్డ్ బాండ్లను రిలీజ్ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది డిజిటల్ రూపంలోని బంగారం, ఇది భౌతికంగా కనిపించదు. ఫిజికల్ గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకుంటే దొంగల భయం సహా కొన్ని రిస్క్‌లు ఉంటాయి. భౌతిక బంగారం కొనాలంటే తరుగు, మజూరీ వంటి అదనపు బాదుడు ఉంటుంది. పైగా, షాపు వాడి తూకం సరిగానే ఉందా/మోసం చేస్తున్నాడా, మనం కొన్న బంగారం మంచిదేనా అన్న సందేహాలు ఉంటాయి. ఈ ఇబ్బందులన్నింటినీ దూరం చేయడంతో పాటు, భౌతిక రూపంలో పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB Scheme).
సావరిన్ గోల్డ్ బాండ్ ప్రయోజనాలు (Advantages of Sovereign Gold Bonds)
SGBల మెచ్యూరిటీ పిరియడ్ 8 సంవత్సరాలు. SGBల్లో మీ పెట్టుబడిపై 2.50% వడ్డీ చెల్లిస్తారు. కాల పరిమితి ముగిసిన తర్వాత, ఆ రోజున ఉన్న గోల్డ్ రేట్‌తో మీ పెట్టుబడి తిరిగి వస్తుంది. దీంతోపాటు, అప్పటి వరకు పోగైన వడ్డీ డబ్బు కూడా వస్తుంది. సాధారణంగా బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి, మెచ్యూరిటీ సమయానికి పెద్ద మొత్తంలో తిరిగి పొందొచ్చు. ఎస్‌జీబీలను 8 సంవత్సరాలు హోల్డ్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బు మొత్తం టాక్స్-ఫ్రీ. ఆదాయ పన్ను పరంగా ఇదొక ప్రయోజనం. మీకు కావాలంటే, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా బాండ్లను సరెండర్ చేసి, అప్పటి మార్కెట్ రేటు ప్రకారం పెట్టుబడిని + వడ్డీ ఆదాయాన్ని పొందొచ్చు. మెచ్యూరిటీ ముందే బాండ్లను రిడీమ్ చేసుకుంటే, ఆ వచ్చే డబ్బుపై టాక్స్ చెల్లించాలి. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ కాలుక్యులేటర్ (Sovereign Gold Bond Calculator)
ఉదాహరణకు… ఒక బాండ్ ధర రూ.6,000 అనుకుందాం. దీనిపై 2.5% వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. 2.5% చొప్పున, రూ.6,000 పెట్టుబడి మీద రూ.150 వడ్డీ ఆదాయం వస్తుంది. ఎనిమిదేళ్లలో, రూ.6000 పెట్టుబడి మీద ఆ ఇన్వెస్టర్‌కు రూ.1,200 (రూ.150 x 8 సంవత్సరాలు) వస్తుంది. ఇది వడ్డీ ఆదాయం మాత్రమే. దీంతోపాటు, ఆ రోజున బంగారానికి ఉన్న మార్కెట్ విలువ ప్రకారం మీ పెట్టుబడి కూడా మీ చేతికి వస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లను ఎలా కొనాలి? (How to buy Sovereign Gold Bonds?)
సావరిన్ గోల్డ్ బాండ్లను కొనడం పెద్ద విషయమేం కాదు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలను పొందొచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్లను ఎవరు కొవనచ్చు? (Who can buy Sovereign Gold Bonds?)
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.
ఎంత బంగారం కొనవచ్చు? (How much gold can you buy?)
గోల్డ్ బాండ్ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని (ఒక బాండ్) కొనాలి. వ్యక్తులు (individuals), ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.
మరో ఆసక్తికర కథనం: డిస్కౌంట్‌లో బంగారం కొనే గోల్డెన్ ఛాన్స్, ఐదు రోజులే ఈ అవకాశం