దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి విడుదలవుతుందో చెప్పడం కష్టం. ఆయన తదుపరి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
‘SSMB 29’ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. మొదట ఈ ఏడాది వేసవిలో స్టార్ట్ అయ్యే అవకాశముందని న్యూస్ వినిపించింది. ఆ తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడసలు ఈ సినిమా ఈ ఏడాది మొదలయ్యే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ‘SSMB 29’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే.. మరోవైపు లొకేషన్ల వేట, పాత్రకి తగ్గట్టుగా మహేష్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వంటివి జరుగుతున్నాయట. అలాగే షూట్ కి వెళ్ళడానికి ముందు కొన్ని వారాల పాటు వర్క్ షాప్స్ నిర్వహించనున్నారట. ఇవన్నీ పూర్తయ్యి.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ మొదలుపెట్టాలంటే.. వచ్చే ఏడాది జనవరి అవుతుందని అంటున్నారు. అందుకే రాజమౌళి.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించలేదని చెబుతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ లో మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి.. చిత్ర విశేషాలకు రాజమౌళి వెల్లడించే అవకాశముందట.
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే.. రెండు మూడేళ్లు పడుతుంది. పైగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ‘SSMB 29’ని మరింత భారీగా రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఇది స్టార్ట్ కావడమే 2025 అంటే.. ఇక రిలీజ్ ఎప్పుడవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.