Sunrisers Hyderabad Team Play: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)… బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే జట్టుగా ఇప్పటివరకూ పేరొంది. ఏదో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు రాణించడం… తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయాలను అందించడం సన్‌రైజర్స్ జట్టులో పరిపాటి. కానీ ఈ ఆటతీరులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏదో పూనకం వచ్చినట్లు… తమ జట్టును తక్కువగా అంచనా వేస్తున్నారన్న కోపం కావచ్చు.. తమను తాము నిరూపించుకోవాలన్న కసి కావచ్చు.. తాము ఆడితే ఎలా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశం కావచ్చు…. కారణమేదైనా సన్‌రైజర్స్ ఆటగాళ్లు… ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపారు. తమను తక్కువ చేసి చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. ఏదో ఒక బ్యాటర్ కాదు… హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్‌క్రమ్ ఇలా విధ్వంసకర బ్యాటర్లు… ప్రత్యర్థి జట్ల బౌలర్లకు గట్టి సవాల్ విసిరారు.
మార్పు మంచిదే
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత అత్యధిక స్కోరు 263. సరిగ్గా పదకొండేళ్ల క్రితం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 175 పరుగులతో అజేయంగా నిలవడంతో… బెంగళూరు 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసింది. ఈ రికార్డును ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకుండా సన్‌రైజర్స్ బద్దలుకొట్టింది. దీనినిబట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఎంత సమష్టిగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు అత్యధిక పరుగుల రికార్డును మళ్లీ బెంగళూరో, ముంబై లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్ రికార్డును సొంతం చేసుకుంది. నెమ్మదైన బ్యాటింగ్‌కు పేరుపడ్డ సన్‌రైజర్స్‌లో వార్నర్ కెప్టెన్ అయ్యాకే దూకుడు పెరిగింది.
కానీ ఇప్పుడున్న దూకుడు మాత్రం అసాధారణం. హెన్రిచ్ క్లాసెన్ రాకతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ స్వరూపం మారింది. ఈ సీజన్‌కు ట్రావిస్ హెడ్ కూడా తోడయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే హెడ్ తనలోని విధ్వంసక ఆటతీరును ఐపీఎల్‌కు పరిచయం చేశాడు. ట్రావిస్ దూకుడుకే తట్టుకోలేకపోతుంటే.. తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు. హెడ్ 18 బంతుల్లో అర్ధశతకం సాధించి సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న బ్యాటర్‌గా నిలిస్తే.. కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. క్లాసెన్ ఈ సీజన్లో 11 సిక్సర్లు బాదాక కానీ తొలి ఫోర్ కొట్టలేదంటే అతడి బ్యాటింగ్ తీరు అర్థం చేసుకోవచ్చు. సన్‌రైజర్స్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ప్రత్యర్థి ఇక పరాక్. బహు పరాక్..
పరుగుల మోతలో రికార్డులు
ఐపీఎల్‌లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు వైపుల బ్యాటర్లు చెలరేగడంతో ఉప్పల్ బౌండరీలతో మోత మోగింది. బ్యాటర్ల రన్ రంగం ముందు బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా హైదరాబాద్ చరిత్ర సృష్టించింది.
అటు ముంబై కూడా 246 పరుగులు చేసింది. ఈ రెండు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో 523 పరుగులు చేశాయి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది. 2023లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 517 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోరు కాగా…. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు బద్దలైంది. పాకిస్తాన్ టీ 20లీగ్‌లో క్వెట్టా-ముల్తాన్ మధ్య జరిగిన పోరులో 515 పరుగుల రికార్డు నమోదైంది.
మరిన్ని చూడండి