హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న భారతావనికి మోదీ గ్యారంటీ.. మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల కోసం రూపొందించే మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాం అన్నారు కిషన్ రెడ్డి. ప్రజల ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించిన వికసిత్ భారత్ సంకల్ప పత్రంను ఆవిష్కరించారు. బీజేపీ జాతీయ మహాసభల సందర్భంగా వచ్చే 5 సంవత్సరాలకుగానూ ఒక ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయేకు 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యం అన్నారు కిషన్ రెడ్డి. విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నారు. బీజేపీ జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా.. ‘ఇదే మన మోదీ గ్యారంటీ’ అని చెబుతున్నారని పేర్కొన్నారు.
5 విభాగాలుగా విజయసంకల్ప యాత్ర
విజయసంకల్ప యాత్ర 5 విభాగాలుగా కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. కొమురంభీమ్ క్లస్టర్, శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్, భాగ్యలక్ష్మి క్లస్టర్, కాకతీయ- భద్రకాళి క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విజయసంకల్ప యాత్రలు జరుగుతున్నాయి. బీజేపీ యాత్రలలో జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, అనేక మంది నాయకులు యాత్రలో పాల్గొన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు, సాధించిన ప్రగతిని ప్రజల ముందు వివరిస్తున్నాం.. రెట్టింపు ఉత్సాహంతో యాత్రను నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఆశించినట్లుగా 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురు స్థానంలో నిలిపేలా కృషిచేయాలన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం, నిస్వార్థంగా సేవ చేసే నాయకత్వం, అన్ని రంగాల్లో విద్య, వైద్యం సౌకర్యాలను మెరుగుపర్చి, ఉపాధి అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. విద్య, ఉపాధి, పెట్టుబడుల కోసం ప్రపంచంలో భారతదేశం మార్క్ గా నిలవాలి. భారతీయ జనతా పార్టీ ‘GYAN’ అనే అజెండాతో ముందుకెళ్తోంది. G – గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y – యువత, A – అగ్రికల్చర్ – వ్యవసాయం, N – నారీ శక్తి. అన్ని వర్గాలకు సంపూర్ణ సాధికారత కల్పించి దేశాభివృద్ధిలో భాగస్వాములు చేస్తామన్నారు. రానున్న ఐదు సంవత్సరాల పాటు ‘GYAN’ అనే అజెండాతో ముందుకెళ్తాం. ఈ సందర్భంగా రెండు రకాల మేనిఫెస్టోలు రూపొందిస్తాం అన్నారు.
కిషన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదాన్ని కార్యరూపంలో చూపిస్తున్నారు. మా పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో – సంకల్ప్ పత్ర కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం. భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేలా ‘వికసిత్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ (అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ) అనే పేరుతో ప్రజాభిప్రాయ సేకరణకు కార్యక్రమాన్ని రూపొందించాం.
ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నేరుగా ప్రజలతో, గ్రూపుల సమావేశాలు, (మిలన్ & సంవాద్) ఇంటింటికీ వెళ్లడం, (డోర్ టు డోర్), వివిధ ప్రోగ్రామ్ సెల్స్, పార్టీ నిర్వహించే వివిధ కార్యక్రమాలు, డిజిటల్ మాధ్యమం, నమో యాప్, మిస్ కాల్ నెంబరు (90-90-90-20-24), సోషల్ మీడియా (వాట్సాప్) ద్వారా.. ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) మాధ్యమాల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు జరిగే ఈ కార్యక్రమం చేపడతాం. ఆయా వర్గాల అభిప్రాయాలను ఢిల్లీలోని ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి చేరవేస్తామని’ చెప్పారు.
మరిన్ని చూడండి