Heatwaves in Telangana and AP, Temperature: అకాల వర్షాలతో గత వారంలో నాలుగైదు రోజులు భానుడి భగభగలు తగ్గాయి. కానీ వేసవికాలం కావడంతో సూర్యుడి తీవ్రత అధికం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు 3 వారాల నుంచి ఎండలకు రాయలసీమ మండిపోతోంది. శనివారం (మార్చి 23న) దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అనంతపురంలో 40.8 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మార్చి 27 వరకు ఎండ వేడి కారణంగా ఉక్కపోత సైతం అధికం కానుంది.
గత ఏడాది తరహాలోనే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో నేటి నుంచి మరో 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారానికి భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2, 3 డిగ్రీలు అధికంగా ఉంటాయి. ఏపీలో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా మారనుంది.
4 రోజులు సూర్య ప్రతాపం..
Telangana Weather- తెలంగాణలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు అధికమయ్యాయి. మార్చి రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పలు ప్రాంతాల్లో 39, 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. నేటి నుంచి మరో 4 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. ఈ నాలుగైదు రోజులు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పలు జిల్లాలల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రాత్రి పూట సైతం ఉక్కపోత తప్పదు. ప్రజలు నీళ్లు ఎక్కువగా తాగాలని.. ఎండలో బయటకు వెళ్లేవారు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
ఏపీలోనూ పొడి వాతావరణం
ఏపీలోనూ సూరీడు సుర్రుమంటున్నాడు. మరో 4 రోజులు రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. 2 నుంచి 3 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత పెరుగుతుందని ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు స్వల్ప వర్ష సూచన ఉంది. అయినా వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని, ప్రజలు అసౌకర్యానికి లోనవుతారని ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 24 , 26 తేదీలలో పశ్చిమ బెంగాల్, సిక్కింలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి వర్షాలు పడే అవకాశం ఉంది. మార్చి 25, 26 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్, గంగా పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరిన్ని చూడండి