ByMohan
Tue 30th Jan 2024 06:46 PM
సినిమా ఇండస్ట్రీలోగానీ, బ్లడ్ బ్లాంక్, ఆక్సిజన్ సీలిండర్స్.. ఇలా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు మెచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణుడిని చేసింది. ఆయనకు ఈ పురస్కారం వచ్చిందని తెలిసినప్పటి నుండి సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో.. స్వయంగా కలిసి అభినందనలు కురిపిస్తున్నారు. వార్త తెలిసి 4 రోజులు అవుతున్నా.. చిరు ఇంట సందడిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆయనను కలిసి అభినందించేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతూనే ఉన్నారు.
మరి అంతా చిరుకు శుభాకాంక్షలు చెబుతుంటే.. ఆయన మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తనతో పాటు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని స్వయంగా వెళ్లి కలిసి అభినందించిన చిరంజీవి.. తాజాగా పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించి.. గొప్పగా సత్కరించారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వారిద్దరిని సగర్వంగా ఇంటికి ఆహ్వానించి.. శాలువాలతో మెగాస్టార్ సత్కరించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్యకి, శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరమని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి గొప్ప వ్యక్తి.. తమను ఇలా వారి ఇంటికి ఆహ్వానించి, సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తెలిసిన వారంతా.. అందుకు కదా.. ఆయన మెగాస్టార్ అయింది అంటూ.. చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
That is The Megastar Chiranjeevi Greatness:
Mega Star Chiranjeevi Congratulates Padmasree Awardees