ByGanesh
Fri 05th Apr 2024 06:12 PM
ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ దిల్ రాజు గీత గోవిందం టైం లోనే విజయ్ దేవరకొండ తో ఓ స్పెషల్ మూవీ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. కరోనా కాలంలోనే రౌడీ స్టార్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. ఎన్నో కాంబినేషన్స్ అనుకున్నప్పటికీ కాకతాళీయంగా గీత గోవిందం కాంబినేషన్ వెతుక్కుంటూ వచ్చింది దిల్ రాజు చెంతకి. అది కూడా దిల్ రాజు అమితంగా ఇష్టపడే కుటుంబ కథే కావడంతో వెంటనే పట్టాలెక్కేసింది. చకచకా సెట్స్ కి వెళ్ళిపోయింది. ఈసారి విజయ్ దేవరకొండ సరసకు హ్యాపెనింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని తీసుకొచ్చి జతచేసారు దిల్ రాజు. అలాగే గీత గోవిందం ఫేమ్ గోపి సుందర్ ని తీసుకొచ్చి విజయ్, పరశురామ్ లకి కలిపారు. పరశురామ్ చెప్పిన ఫామిలీ బేస్డ్ స్టోరీ లైన్ విని ఇంప్రెస్స్ అయ్యినందుకే ఈ ప్రాజెక్ట్ పట్ల తానింత శ్రద్ద చూపించానని ఇటీవలే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు దిల్ రాజు.
నిజానికి ప్రతి కుటుంబంలో ఓ ఫ్యామిలీ స్టార్ ఉంటారు. ఆ వ్యక్తి బరువైన బాధ్యతలను ఎన్నింటినో మోస్తూ కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో చేసే త్యాగాలు, పడే అగచాట్లు మధ్య తరగతి జీవులందరికి తెలిసినవే. అలాంటి ఓ కేరెక్టరైజేషన్ తో, ఓ సగటు కుటుంబ కథకి లవ్ స్టోరీని కూడా యాడ్ చేసి ఓ పర్ఫెక్ట్ ప్యాకేజ్ లా ఫ్యామిలీ స్టార్ ని తెరపైకి తీసుకురావడమే తమ ఉద్దేశ్యమని పలుమార్లు చెప్పారు దిల్ రాజు. అంతేకాదు ప్రమోషన్స్ లోను అదే మాటని పాటిస్తూ ముందు నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చెయ్యాలనే ప్రయత్నం చేసారు. సినిమా రిలీజ్ కి ముందే తన సన్నిహితుల కుటుంబాలకు ప్రొజెక్షన్ వేసిన దిల్ రాజు మీడియా మిత్రుల కుటుంబాలని కూడా ఫ్యామిలీ స్టార్ ఈవెంట్స్ కి ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రతి ఒక్కరిని స్వయంగా స్వాగతించడం హర్షించదగ్గ విషయం.
అయితే బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, పరుగు, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, బలగం.. ఇలా ఎన్నో ఎన్నదగ్గ కుటుంబ కథా చిత్రాలని అందించిన దిల్ రాజు పై అభిమాన ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నేడు విడుదలైన ఫ్యామిలీ స్టార్ పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ వాల్యూస్ కి దిల్ రాజు ఇచ్చే విలువెంతో ఫ్యామిలీ స్టార్ లో స్పష్టంగానే కనిపిస్తున్నా.. నేరేషన్ ఫ్లాట్ గా ఉండడం, లెంత్ ఎక్కువైపోవడం నెగెటివ్ అయ్యిందనేది విశ్లేషకుల వాదన. తెరపై అందరిని ఆకర్షించే జంట విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ ఉండనే ఉన్నారు. ఫస్ట్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ స్టార్ నచ్చిన సెన్సిబుల్ ఆడియన్స్ కూడా చాలామందే ఉన్నారు. ఇక ప్రమోషన్స్ వైజ్ తన ప్రత్యేకత చూపించే దిల్ రాజు అండ కూడా ఉంది కనుక బహుశా ఈ సమ్మర్ సీజన్ లో ఫ్యామిలీ స్టార్ గట్టెక్కేస్తాడేమో హిట్టు మెట్టేక్కేస్తాడేమో చూద్దాం.
The real Family Star Dil Raju :
All are saying The Real Family Star Dil raju