TREIRB DL Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ (DL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 28న రాత్రి వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఫిబ్రవరి రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులకు 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించింది. ఇక దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. అలాగే.. గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 29న) వెల్లడికానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తిచేసింది.
మరిన్ని చూడండి