వివాదాలకు మారుపేరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్ కౌంటర్ సినిమాపై (disha Encounter movie) తెలంగాణ హైకోర్టు వర్మకు నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ సినిమా ఆపాలంటూ దిశ తండ్రి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది.సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోక ముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు.. రాంగోపాల్ వర్మకు (ram gopal varma) నోటీసులు జారీ చేసింది.
అలానే సినిమాకు (Varma’s Disha Movie) అనుమతులున్నాయో లేదో తెలుసుకొని చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు.
ఇదిలా ఉంటే సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలని ‘దిశ.. ఎన్‌కౌంటర్’ చిత్ర నిర్మాత నట్టి కుమార్ అన్నారు. చట్టాలకు లోబడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎవరి మనోభావాలను కించపరచే విధంగా సినిమా తీయడం లేదని చెప్పారు. దిశ బయోపిక్‌ని తీయడం లేదని, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. సెన్సార్ బోర్డు ఇంకా మాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని నట్టికుమార్ వెల్లడించారు. దిశ కమిషన్‌కు సంబంధించిన విషయాలను సినిమాలో ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా ఈ చిత్రంలో చూపించామమని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా నిడివి గంటా 50 నిముషాలు ఉంటుందని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో పోకిరీలు పెట్టే కామెంట్స్‌పై స్పందించలేమని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నట్టికుమార్ కోరారు. దిశ చిత్రంపై పూర్తి వివరాలను వర్మ త్వరలో వెల్లడిస్తారని తెలిపారు.