Kohli Pens Emotional Note To Anushka After T20 World Cup Win: టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచి మూడు రోజులు అవుతున్నా… ఆటగాళ్లు, అభిమానులు ఆ ఆనందం నుంచి..భావోద్వేగ క్షణాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన క్షణం సాకారం కావడంతో ఆటగాళ్లు ఇంకా ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇంకా ఆ మధుర క్షణాలను తలుచుకుని భావోద్వేగానికి గురవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్… మనస్సును హత్తుకునేలా ఉంది. తన విజయంలో భార్య అనుష్క శర్మ పాత్రను వివరిస్తూ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. తన విజయ ప్రస్థానం క్రెడిట్ అంతా అనుష్క శర్మ(Anushka)దే అని విరాట్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ పోస్ట్ పెట్టిన తర్వాత అనుష్క కూడా పోస్ట్ చేశారు.
కింగ్ కోహ్లీ పోస్ట్
జూన్ 29 రాత్రి భారత్ ప్రపంచకప్ గెలిచిన వెంటనే ఆటగాళ్ల కన్నీళ్లతో.. రిటైర్‌మెంట్ ప్రకటనలో దేశమంతా పూర్తి భావోద్వేగ వాతావరణం కనిపించింది. టీ 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ తరానికి అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో ఈ ఫార్మట్ నుంచి వైదొలుగుతున్నట్లు కింగ్ వెల్లడించాడు. అనంతరం ఇన్ స్టాలో విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ చేశాడు. క్రికెట్‌లో తాను సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించింది తన సతీమణి అనుష్కే అని విరాట్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నువ్వు లేకుండా ఇదంతా అసాధ్యం అని పోస్ట్ చేశాడు. ” మై లవ్.. నువ్వు లేకుండా ఇదంతా అసాధ్యం. నువ్వు నన్ను నిరాడంబరంగా ఉండేలా చేశావ్.. పూర్తిగా నిజాయతీగా ఉంటేనే ఇది సాధ్యమని ఎప్పుడూ చెప్తూ ఉంటావ్.. అందుకు నేను నీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పాలో… ఈ గెలుపు నాది మాత్రమే కాదు నీది కూడా.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.” అని కోహ్లీ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు తాను అనుష్క కలిసి ఉన్న ఫొటోను విరాట్ జత చేశాడు.
అనుష్క పోస్ట్
టీమిండియా విశ్వ విజేతలుగా నిలిచిన తర్వాత అనుష్క శర్మ కూడా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌లోని కోట్ల మంది అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని అనుష్క పోస్ట్ చేసింది. త్రివర్ణ పతాకంతో ఉన్న కోహ్లీ ఫొటోను పోస్ట్ చేస్తూ విరాట్ నువ్వు నావాడివి.. ఓ ఛాంపియన్‌వి అంటూ అనుష్క ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇది ఎంత అద్భుతమైన విజయం.. మీరు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అంటూ అనుష్క ఆ పోస్ట్‌లో పేర్కొంది. టీమిండియా ఆటగాళ్లందరికీ అభినందనలంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
మరిన్ని చూడండి