Weather Latest News: నిన్న తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్నాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2 డిగ్రీలుగా నమోదైంది. 73 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
మండిపోతున్న ఎండలు
గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు ఇప్పుడిప్పుడే మండి పోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెల కాక ముందే ఎండలు మండి పోతుండడంతో మార్చి నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు, సరూర్ నగర్, చందా నగర్‌లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్‌లో 37.3 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్‌లో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Weather: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ, నైరుతి దిశల్లో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మరిన్ని చూడండి