West Indies All-Rounder Fabian Allen: దక్షిణాఫ్రికా(South Africa) స్టార్ క్రికెటర్‌ను తుపాకీతో బెదిరించి విలువైన వస్తువులు దోపిడీ చేసిన ఘటన క్రికెట్(Cricket) ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. పటిష్టమైన భద్రత మధ్య ఉండాల్సిన క్రికెటర్‌ను దొంగలు… తుపాకీతో బెదిరించి మరీ దోపిడీ చేయడం షాక్‌గు గురిచేసింది. దక్షిణాఫ్రికాలో ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్(Fabian Allen)కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనతో ఫాబియన్ భయంతో వణికిపోయాడు. అతను బస చేస్తున్న హోటల్‌లోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు.
అసలు భద్రతే లేదా..?
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో పార్ల్ రాయల్స్ తరపున ఫాబియన్ అలెన్ ఆడుతున్నాడు. దుండగలు తుపాకితో బెదరించి.. అతడి సెల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జట్టు ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ… ఫాబియన్‌తో ఇప్పటికే మాట్లాడాడని.. మరో విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్‌కాయ్ కూడా ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడని విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. కానీ ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ ఇంకా స్పందించాల్సి ఉందని విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఫాబియన్ అలెన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 7.60 సగటుతో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. 8.87 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. పార్ల్ రాయల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. నేడు జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో పార్ల్ రాయల్స్ తలపడుతుంది. ఇక అలెన్ వెస్టిండీస్ తరఫున 20 వన్డేలు ఆడి.. 200 పరుగులు, ఏడు వికెట్లు తీశాడు. 34 టీ20ల్లో 267 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టాడు.
విండీస్ ఆశలన్నీ షమార్‌పైనే
షమార్ జోసెఫ్(Shamar Joseph) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్ సీమర్ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ చారిత్రాత్మక గెలుపుతో కరేబియన్ ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయాన్ని కళ్లారా చూసిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ఏకంగా గ్రౌండ్ లోనే భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్నాడు. తాను ఆడుతున్న రెండో టెస్ట్ లోనే ఆసీస్ లాంటి మేటి జట్టును బెంబేలెత్తించి… నయా సంచలనంగా మారాడు. ఈ కరేబియన్ స్పీడ్ స్టర్ పై వరల్డ్ వైడ్ గా ప్రశంసల వర్షం కురుస్తోంది. 24 ఏళ్ల ఈ కుర్రాడి పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. స్టార్క్ యార్కర్ బలంగా తాకి షమార్ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో మైదానాన్ని వీడిన అతను.. తర్వాతి రోజు జట్టు కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుని మైదానంలోకి వచ్చి తన జట్టుకు చరిత్రలో మర్చిపోలేని గెలుపును అందించాడు. టెస్టు క్రికెట్‌ను కాపాడే రక్షకుల్లో ఒకడిగా షమార్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అభివర్ణించాడు.