England Vs India 1st Test : హైదరాబాద్(Hyderabad) వేదికగా జరిగిన ఇంగ్లాండ్(England)తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్(Team India) ఓటమి..అనేక ప్రశ్నలను లేవనెత్తింది. బ్రిటీష్ జట్టును స్పిన్‌తో చుట్టేదామనుకున్న రోహిత్ సేన పన్నిన వ్యూహం మనకే ఎదురు తిరిగింది. బాగా తెలిసిన పిచ్‌పై భారత బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ పోప్.. పోరాటం అబ్బురపరిచింది. ఒంటరి పోరాటం చేసి మరీ పోప్ ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడడమే భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తన్నాయి. బజ్‌బాల్ ఆటతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడ్డ స్థితి నుంచి అద్భుతంగా పుంజుకోగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఉపయోగించుకోలేక రోహిత్ సేన పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ల ఆట గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోప్ అడ్డుగోడగా నిలబడ్డ చోట టీమిండియా బ్యాటర్లు అడ్డంగా చేతులెత్తేశారు. ఒక్క బ్యాటర్ పట్టుమని అర్ధ సెంచరీ కూడా సాధించనేలేదు. టీమిండియా పూర్తిగా డిఫెన్సీవ్ మోడ్‌లోకి వెళ్లగా ఇంగ్లండ్ టీంలో ఆ డిఫెన్సివ్ మోడ్ కనిపించలేదు.
స్పష్టంగా కోహ్లీ, పంత్ లేని లోటు
తొలి టెస్ట్‌లో స్టార్ బ్యాటర్లు, విరాట్, పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్ట్‌లో పంత్ అద్భుత ఆటతీరుతో టీమిండియాకు చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందించాడు. కానీ హైదరాబాద్‌లో భారత్‌కు 12 ఏళ్లుగా ఓటమే లేని మైదానంలో టీమిండియాకు అలాంటి బ్యాటరే కరువయ్యాడు. ఒక్క బ్యాటర్ కూడా అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. అదే విరాట్ ఉండుంటే ఛేదన తేలికయ్యేదని చాలామంది భావిస్తున్నారు. ఛేదనలో అద్భుతంగా ఆడతాడన్న ముద్రలో కోహ్లీ… ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాను విజయ తీరాలకు చేర్చేవాడేమో. కానీ వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఆటగాళ్లలో ఎక్కడా పాజిటివ్ ఆలోచన కనిపించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అసలు జట్టు లక్ష్యాన్ని సాధించే దిశగా పయనించనే లేదు. అందరూ రక్షణాత్మక ధోరణిలోనే ఆడి టీమిండియా ఓటమికి కారణమయ్యారు.
స్పిన్ ఉచ్చులో చిక్కి…
190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఓ దశలో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిస్తుందేమో అనిపించింది. కానీ పరిస్థితి తలకిందులైంది. అనూహ్యంగా భారత్ తడబడటంతో తనకు అలవాటైన రీతిలో పుంజుకున్న ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ విజయానికి ప్రధాన కారణం ఒలీ పోప్, టామ్ హార్ట్‌లీ. రెండో ఇన్నింగ్స్‌లో పోప్ 196 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు ఆశలు నిలపగా.. హార్ట్‌లీ 7 వికెట్లతో గెలిపించాడు. మొత్తంగా తన అరంగేట్ర టెస్టులో అతను 9 వికెట్లు సాధించాడు. స్పిన్‌తో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాలని చూసిన భారత్‌కు అదే బూమరాంగ్‌లా తగిలింది. పోప్ దెబ్బకు లైన్, లెంగ్త్ తప్పిన మన స్పిన్నర్లు పరుగులు ఇచ్చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 45/1తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పోప్ 386 నిమిషాల పాటు క్రీజులో నిలిచి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై అశ్విన్, జడేజా, అక్షర్ లాంటి స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఇక హార్ట్‌లీ స్పిన్‌కు మన బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ కనీసం స్వీప్ షాట్లు ఆడాడు. మిగతా బ్యాటర్లకు క్రీజులో నిలవడమే కష్టమైపోయింది. అశ్విన్, భరత్ లాగా మిగతా బ్యాటర్లూ కనీస పోరాట పటిమ ప్రదర్శించి ఉంటే ఫలితం మరోలా ఉండేదే.