ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన పేరున అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. వన్డేలో వేగంగా రెండు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వద్ద ఈ స్టార్ ఓపెనర్ ఈ రికార్డు సృష్టించాడు. గిల్ కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. కానీ గిల్… అమ్లా కంటే రెండు ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి 2000 పరుగులు చేశాడు.
12 ఏళ్ల క్రితం భారత జట్టుపై హషీమ్ ఆమ్లా ఈ రికార్డు సృష్టించాడు. 2011 జనవరిలో అమ్లా తన 41వ వన్డే మ్యాచ్‌లో 40వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకుని అత్యంత వేగంగా వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన జహీర్ అబ్బాస్ 1983లో 45వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు అమ్లా బద్దలు కొట్టాడు. అబ్బాస్ పేరిట 28 ఏళ్లుగా ఉన్న రికార్డును అమ్లా బద్దలు కొట్టాడు. ఇప్పుడు 12 ఏళ్లుగా అమ్లా పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. మరో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 48 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేశాడు.
వన్డేలో అద్భుత రికార్డు
శుభ్‌మన్ గిల్ 2019లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో శుభమన్ గిల్ రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ 37 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1986 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్ స్ట్రైక్ రేట్ కూడా 102.84 ఉండడం అతను ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో చెబుతుంది. శుభ్‌మన్ 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు.ప్రస్తుతం గిల్ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు.
ఐసీసీ అవార్డు
ఇటీవలే టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్, టీమిండియా పేస్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి… సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్ నిలిచాడు. సెప్టెంబర్ నెలలో గిల్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్‌త అదరగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్ ఓపెనర్ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లకు డెంగ్యూ కారణంగా దూరమైన గిల్… ఇప్పుడు మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో గిల్‌పై క్రికెట్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.