YS Sharmila Son Raja Reddy gets married to Priya Atluri: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. దివంగత నేత వైఎస్సార్ మనవడు, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ (Jodhpur)లోని ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy), అట్లూరి ప్రియ (Atluri Priya)ల వివాహం వైభవంగా జరిగింది. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియకు షర్మిల కంగ్రాట్స్ చెప్పారు.
ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల వేడుక నిర్వహించనున్నారని సమాచారం. గత నెల 18న హైదరాబాద్‌లో రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక జరిగింది. షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఎంగేజ్ మెంట్‌కు హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్‌ను, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులను, ఇతర ప్రముఖులను తన కుమారుడు వివాహానికి షర్మిల ఆహ్వానాలు అందజేయడం తెలిసిందే. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించారు. తొలి వివాహ ఆహ్వాన పత్రికను తండ్రి సమాధి వైఎస్సార్ ఘాట్‌లో ఉంచి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
మూడు రోజుల పాటు అట్టహాసంగా వివాహ వేడుకలు
కుమారుడు రాజారెడ్డి వివాహం ఘనంగా నిర్వహించడంలో భాగంగా వైఎస్ షర్మిల కుటుంబసభ్యులు రెండు రోజుల కిందటే రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు. 16న తేదీన సంగీత్, మెహందీ వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల తాజాగా తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. ఈ 17న (శనివారం) సాయంత్రం 5.30 గంటలకు రాజా రెడ్డి, ప్రియలు ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు ప్రముఖుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం సైతం ప్రత్యేక ప్రార్థనలతో పాటు వివాహ వేడుకలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్ లో గ్రాండ్‌గా విందు!
రాజస్థాన్‌లో వివాహం కావడంతో అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాల్లో షర్మిల పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్ మెంట్‌కు ఆమె సోదరుడు, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. కానీ మేనల్లుడి వివాహానికి ఏపీ సీఎం హాజరు అయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఓ వైపు రాజకీయ విమర్శలు, మరోవైపు రక్తబంధం అన్నట్లుగా వైఎస్సార్ ఫ్యామిలీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజా రెడ్డి, ప్రియల వివాహం రాజస్థాన్ లో జరగడంతో వేడుకకు ఎవరు హాజరయ్యారు అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది.
మరిన్ని చూడండి